అహ్మద్ పటేల్ ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్ నుంచి ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన అహ్మద్ పటేల్ సోమవారంనాడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మరో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా పాల్గొన్నారు. ఇటీవల నాటకీయ పరిణామాల మధ్య గుజరాత్ రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో అహ్మద్ పటేల్ గెలుపొందారు. అహ్మద్ పటేల్ గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎమ్మెల్యేలను కర్ణాటకలోని రిసార్ట్‌కు తరలించి ఓటింగ్ సమయంలో వారిని తిరిగి గుజరాత్ తీసుకుచ్చింది. ఇద్దరు కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు బీజేపీ అభ్యర్థికి వేసిన ఓట్లు చెల్లవని చివరి నిమిషంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోవడంతో బొటాబొటీ ఓట్లతో అహ్మద్ పటేల్ గెలుపొందారు. కాగా, గుజరాత్ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందిన అమిత్‌షా, స్మృతి ఇరానీ ఈనెల 25వ తేదీన రాజ్యసభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు.