ఆంగ్లమే ప్రామాణికం అనుకోవడం అజ్ఞానమే..!!

రష్యా, చైనా, జపాన్‌, ఫ్రాన్స్‌ అధినేతలకు కూడా ఆంగ్లము రాదు..
ప్రధాని మోడీ, అమిత్‌ షాలకూ అంతంత మాత్రమే..
ఇంగితం లేనోళ్లే సీఎం రేవంత్‌రెడ్డి ఇంగ్లీష్‌పై రాద్ధాంతం

‘అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు.. సకిలించు ఆంధ్రుడా! చావ వెందుకురా!?’ అన్నారు మహాకవి కాళోజీ. అన్ని భాషలూ నేర్చుకో కానీ మాతృభాషను మాత్రం మరవద్దని హితవు పలికారాయన. మాతృభాష రాకపోతేనే నేరమని ఉద్ఘాటించారు. భాష కేవలం భావ వ్యక్తీకరణ కోసమే..! ఆంగ్ల భాష రానంత మాత్రాన ఉన్నత పదవులకు అర్హులు కాదన్నట్టు, పుట్టిన గడ్డ ఔన్నత్యమే తరిగిపోతున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి విషయంలో ఇంగితజ్ఞానం లేనోళ్లే రాద్ధాంతానికి దిగుతున్నారు. ప్రపంచంలో ఎంతోమంది దేశాధినేతలకు ఆంగ్లం రాదన్న కనీస విషయాన్ని గుర్తెరగ‘నోళ్లే’ కుప్పిగంతలకు పాల్పడుతున్నారు. ప్రధాని మోడీతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న ఎంతోమంది విదేశీ భాష మాట్లాడలేరనే విచక్షణను మరిచి వెగటు పోస్టులు పెడుతూ వికటాట్టహాసం పొందుతున్నారు. వారి వెకిలి పోస్టులకు మద్దతు కాదు కదా.. అసలు ఆంగ్లమే ప్రామాణికం అనుకుంటున్నవారు అజ్ఞానులేనన్న చర్చ ఊపందుకుంది.

హైదరాబాద్‌, జనవరి 19 (జనంసాక్షి) :చైనా, జపాన్‌, జర్మనీ, ప్రాన్స్‌ తదితర దేశాలు వారివారి మాతృభాషలోనే విద్యాబోధన చేస్తున్నప్పటికీ ప్రపంచాన్ని శాసించేస్థాయికి ఆ దేశాలు ఎదిగాయి. అభివృద్ధిల్లో ఎన్నో రేట్లు ముందుంటున్నాయి. రష్యా అధ్యక్షుడు, జపాన్‌ ప్రధాని, చైనా అధ్యక్షుడు కూడా విదేశీ పర్యటనల్లో ఇంగ్లీషులో మాట్లాడరు. అయినప్పటికీ ప్రపంచాన్ని శాసించే స్థాయిలో వాళ్ల నాయకత్వ పటిమ కొనసాగుతోంది. ఆంగ్ల వాక్చాతుర్యం ఉన్నవారే దేశాధినేతలు అయిపోతే ఇప్పటికే కేఏ పాల్‌ ఎప్పుడో పీఎం, సీఎం అయ్యేవారని పలువురిలో చర్చ మొదలైంది. ఎన్నో అంతర్జాతీయ సదస్సుల్లో కూడా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు తమ మాతృభాషలోనే సంబోధిస్తున్నారు. వాటిని అనువాదకులు తర్జుమా చేసి వినిపిస్తున్నారు. మారుమూల పల్లె నుంచి మెట్రో నగరాల్లో పుట్టిపెరిగిన వారు కూడా ఆంగ్లంలో మాట్లాడలేకపోయినా అంతర్జాతీయ సదస్సులూ, సభలూ అనువాద విధానంలో విజయవంతం అవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సు సందర్భంగా మాట్లాడిన తీరుపై మాత్రం కొందరు సోషల్‌ మీడియాలో దాడిపెంచడం జుగుప్సాకరంగా మారింది. మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ గతంలో పలు వేదికలపై మాట్లాడిన ఇంగ్లీష్‌ వీడియోలతో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్ట దిగజారిందని మరికొందరు గగ్గోలు పెడుతున్న పరిస్థితి మాతృభాషా ప్రేమికులను, మేధావులను విస్మయానికి గురిచేస్తోంది. ఇంగ్లీష్‌ రాకపోతే ఇక అంతేనన్న భావనను తీసుకొస్తుండటం ఒకరకమైన ఆందోళనకూ దారితీస్తోంది.
ప్రధాని మోడీకి విదేశీ భాష వచ్చునా?
గుజరాత్‌లో పుట్టిపెరిగిన ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ దేశాల పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఏ భాష మాట్లాడుతున్నారు? హిందీలో మినహా ఆయన ఆంగ్ల భాష మాట్లాడలేరు. అలాగని ప్రధానమంత్రికి ఆయన అర్హుడు కాడనే విమర్శలు ఎక్కడా ఎవరూ వ్యక్తం చేయలేదు. విధానపరమైన, ప్రజావ్యతిరేక అంశాలపై మాత్రమే ప్రతిపక్ష పార్టీలు ఆయనను నిలదీస్తుండటం చూస్తున్నాం.. కానీ మరీ దిగజారిపోయి భాష రాదనే హేళనకు ఏనాడూ పాల్పడలేదు. 200 పైచిలుకు దేశాలున్న ఈ ప్రపంచంలో ఎంతోమంది దేశాధిపతులు ఇంగ్లీష్‌లో ప్రసంగించలేరు. ఎన్నో వేదికలపై తమ మాతృభాషలోనే చెప్పాలనుకున్నది చెప్పేస్తున్నారు. దానిని అనువాదం చేసి, అవసరమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. గతేడాది ఆంగ్లం మీద వ్యామోహం తగ్గించాలనే ఉద్దేశంతో ఇటలీ ప్రభుత్వం కూడా కొత్త బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పదవుల్లో ఉన్న ఎవరైనా ఇటాలియన్‌ భాషనే వాడాలని, మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు ఆంగ్లం, ఇతర ఏ భాషనైనా ఉపయోగిస్తే 4 లక్షల నుంచి 82 లక్షల వరకు జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఆ దేశ ప్రధాని కూడా మద్దతునివ్వడం మాతృభాష పరిరక్షణ ప్రాముఖ్యతను తెలియజేసింది. మరి ఆంగ్లంలో మాట్లాడితేనే దేశాలు, రాష్ట్రాల ప్రాముఖ్యత పెరుగుతుందని భావిస్తుండటం ట్రోలర్ల అవివేకమే అవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు మీడియంతో పాటు ఇతర రాష్ట్రాల్లో తమ భాషలో చదువుకున్న ఎంతోమంది విద్యావంతులు నేడు అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్న విషయాన్ని గుర్తెరగాలని సూచిస్తున్నారు.
సీఎంకు మద్దతుగా నెటిజన్లు
రాష్ట్రంలోనే ప్రముఖంగా పేరొందిన నారాయణ విద్యా సంస్థల చైర్మన్‌ ఇంగ్లీషు ప్రసంగించడంలో చాలా వీక్‌. కానీ ఆయన స్కూల్స్‌లో పనిచేసే మార్కెటింగ్‌ సిబ్బంది, రిసెప్షనిస్టులూ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడతారు. అందంగా కనిపించడం, ఇంగ్లీషు బాగా మాట్లాడడమే గొప్పయితే ఆంగ్ల న్యూస్‌ చానెళ్ల యాంకర్లు, స్టార్‌ హోటల్స్‌ రిసెప్షనిస్టులు, ఎయిర్‌ హోస్టెస్‌లు సీఎంలో, పీఎంలో, కనీసం మంత్రులైనా అయ్యుండాలి. మారుమూల పల్లెలో జన్మించిన సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కిందిస్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. విదేశాలతో పనిలేకుండా పుట్టిపెరిగిన గడ్డపైనే వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఏ పార్టీలో ఉన్నా యువతలో, పార్టీ కార్యకర్తల్లో క్రేజ్‌ పెంచుకున్నారు. ప్రజల ఆమోదమూ ఆయనకు సంపూర్ణంగా లభించింది. యువనేతగా ఉన్న రేవంత్‌రెడ్డి ‘ప్రజాపాలన’లో ముందుకుసాగడమే తరువాయి. కాలం గడుస్తున్న కొద్దీ సర్కారు నిర్ణయాలపై సమీక్షలు అనివార్యమే. అయితే, దావోస్‌లో జరుగుతున్న సదస్సులో ఎలాంటి బెరుకూలేకుండా ప్రసంగించడం, తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన ఆంగ్ల భాషపై ప్రతిపక్షాలు చేస్తున్న ట్రోల్‌లను మేధావులు, విశ్లేషకులు సైతం తప్పుబడుతున్నారు. ఆంగ్ల భాష చుట్టూ చర్చ పెడుతున్నవారిని తిప్పికొడుతూ రేవంత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. భాషే ప్రధానం కాదు, భావాన్ని వ్యక్తీకరించడమూ ముఖ్యమేనని నొక్కివక్కాణిస్తున్నారు.