ఆందోళనలో కౌలు రైతులు

పంటనష్టంతో దిక్కుతోచని స్థితి

కరీంనగర్‌,జనవరి28(జ‌నంసాక్షి): అకాలంగా భారీ వర్షం కురవగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్‌ అర్బన్‌ మినహా మిగతా అన్ని మండలాల్లోనూ ఆరుతడి పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల క్రమంలో వేల ఎకరాలు బీడుగా వదిలేయగా నీటిసౌకర్యమున్న రైతులు మాత్రమే పంటలను సాగు చేశారని తెలుస్తోంది. చాలామంది కౌలు రైతులు పంటనష్టోపోయి ఆందోళనకు గురవుతున్నారు. తాము గట్టెక్కేదెలా అన్న బయంలో ఉన్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అయితే అధికారుల నష్ట మదింపు తీరు విమర్శలకు తావిస్తోంది. వ్యవసాయ విస్తరణ అధికారులు, ఏవోలు పట్టణాలను వీడటంలేదని సమాచారం. ఫసల్‌ బీమాపై రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ విఫలమవడంతో ఆశించిన స్థాయిలో బీమా చేయలేదు. పంటలను చూసి అందరూ జాలిపడటమే తప్పా సహాయంపై ఎవరూ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం దారుణ పరిణామం. పంటనష్టాలతో ఆరుగాలం కష్టపడిన అన్నదాతల క్లళెదుటే పంట నీళ్లపాలవడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు. బీమా పరిహారమైనా అందుతుందా అంటే అదీ లేదు. వేల ఎకరాల్లో పంటనష్టం ఉంటుందని అంచనా. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకంతో రైతులకు కనీసం పెట్టుబడి అయినా వచ్చే అవకాశం ఉండేది.. కానీ, వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో పరిహారం పొందలేకపోయారు. ప్రస్తుతం పంట నష్టపోయిన రైతుల్లో బీమా చేసిన రైతులు పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నారు. ఫసల్‌ బీమా చేస్తే పంటలకు హెక్టారుకు రూ.13వేల వరకు వచ్చే అవకాశం ఉండేది. గ్రామ యూనిట్‌గా నష్టాన్ని లెక్కించేవారు. బీమా చేసిన వారికి కూడా పరిహారం ఏడాది దాటినా చేతికందడం లేదు. వర్షాలు కౌలు రైతులకు మరింత కష్టాన్ని తెచ్చిపెట్టాయి. చేతికందివచ్చిన పంటను వర్షం తన్నుకుపోవడంతో పెట్టిన పెట్టుబడి పోయింది.. పైగా భూ యజమానులకు కౌలు డబ్బులు ఎలా చెల్లించమం అన్న ఆందోళనలో ఉన్నారు. పంటనష్టాన్ని అందించాలని కౌలు రైతులు కోరుతున్నారు.