ఆంధ్రావాళ్లు చెబితే తెలంగాణ వారు ఓటేస్తారా?
లగడపాటి సర్వేలపై ఎందుకంత ఉలికిపాటు
హైదరాబాద్,డిసెంబర్3(జనంసాక్షి): తెలంగాణెన్‌ఇనకల ప్రచారంలో ఇప్పుడు ఆంధ్రావారి ప్రభావం ఉంటుందా అన్నది ప్రధానంగా చర్చగా మారింది. చంద్రబాబు ప్రచారంతో ఇది మరింత ఎక్కువయ్యింది. అయితే ఇక్కడ ఓట్ల వరకు బాగానే ఉన్నా ప్రజల మధ్య మళ్లీ విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేతలపై ఉంది. నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రాంత నాయకులు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారు. దీనిని తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే 60 ఏళ్లపాటు కలసి పోయిన ప్రాంతాన్ని విడిపోకుండా చూడాలని అనుకున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం రాకుండా ఆంధ్రావాళ్లు కుట్ర పన్నుతున్నారని చెబితే తెలంగాణ ప్రజలు నమ్మారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో ఓట్లు వేయవలసింది తెలంగాణ ప్రజలే. ఆంధ్రావాళ్లు వారి మనస్సును మార్చడానికి అవకాశాలు లేవనే చెప్పాలి. సొంత రాష్ట్రం సిద్ధించిన తరవాత తెలంగాణ ప్రజలలో ఆంధ్రా ప్రాంతంపై వ్యతిరేకత లేదు. అలాగే ఇక్కడ నివసిస్తున్న వారిపైనా వ్యతిరేకత లేదు. దీనిపై పదేపదే ప్రస్తావన చేయడం కూడా మంచిది కాదు. తమకు వ్యతిరేకంగా ఆంధ్రావాళ్లు కుట్ర పన్నుతున్నారని ప్రచారం
చేయడం తమను తాము వంచించుకోవడమే అవుతుంది. ఎందుకంటే లగడపాటి రాజగోపాల్ లేదా మరొకరో చెప్పినంత మాత్రాన ప్రజలు తమ అభిప్రాయం మార్చుకోరు. కేసీఆర్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఎవరో చెబితే ప్రజలు వింటారనుకోవడం భ్రమే అవుతుంది. కేసీఆర్ లేదా టిఆర్‌ఎస్ నేతలు తమపై వస్తున్న విమర్శలపైన దృష్టి సారించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే వారికే మంచిది. అలా కాకుండా ఆంధ్రావాళ్ల కుట్రలు అని ప్రచారం చేసుకుంటే ఒరిగే ప్రయోజనం ఉండదు. ఈ ఎన్నికలలో ఇండిపెండెంట్లు అధిక సంఖ్యలో గెలవబోతు న్నారన్న లగడపాటి వ్యాఖ్యలపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. అలా చేస్తే లగడపాటికి ప్రాధాన్యం ఇచ్చిన వారం అవుతాం. వ్యతిరేకంగా వచ్చే సర్వేలను కుట్రలుగా పోల్చడం ఆత్మవంచనే అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో ఓట్లు వేయవలసింది తెలంగాణ ప్రజలే. ఆంధ్రావాళ్లు వారి మనస్సును మార్చలేరు. లగడపాటి రాజగోపాల్ లేదా మరొకరో చెప్పినంత మాత్రాన వారు తమ అభిప్రాయం మార్చుకోరు. కేసీఆర్ చెబుతున్నది విననివారు లగడపాటి వంటివారు సర్వే పేరిట చెబితే వింటారనుకోవడం కూడా పొరసాటే కాగలదు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితికి 90 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. దీంతో అధికార పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు రెండున్నర నెలల తరువాత అదే లగడపాటి చెప్పిన అంచనాలను మాత్రం టీఆర్‌ఎస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే తమ ఆటలు సాగవనే బలహీన ప్రభుత్వం ఉండాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ ఆరోపించారు. తెలంగాణలో బలమైన పార్టీ, స్థిరమైన ప్రభుత్వం ఉండడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. బలహీనమైన ప్రభుత్వం ఉంటేనే గోదావరి, కృష్ణా నీళ్లను మళ్లీ ఆంధ్రాకు తరలించుకుపోవచ్చుననీ, హైదరాబాద్ పేరును నిర్వీర్యం చేస్తే పరిశ్రమలు తీసుకపోవచ్చుచన్న కుట్రలు పన్నుతున్నారని దుయ్య బట్టారు. తెలంగాణను అస్థిరపర్చేందుకే చంద్రబాబు కుట్రలు పన్ని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. వీరికి తోడుగా లగడపాటి కలిశారనీ, ఇప్పటికే తెలంగాణలో ఎంపీగా పోటీ చేస్తానని లగడపాటి చెప్పడం వెనుక చంద్రబాబు ఉన్నారని అన్నారు. లగడపాటి సర్వే ఊహాజనితమైందనీ, ఇదంతా పచ్చి బూటకమని మండిపడ్డారు. లగడపాటి కాంగ్రెస్, టీడీపీలకు వారధిగా పనిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో యువతను తప్పుదారి పట్టించేందుకే ఈ సర్వేలు ప్రచురితం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలన్నింటినీ ప్రజ లు అవగాహన చేసుకోవాలని సూచించారు. నిజానికి సర్వేల ఆధారంగా ప్రజలు ఓటు చేస్తారనుకోవడం పొరపాటు కాగలదు.