ఆంధ్రా పార్టీలు మఠాష్
– తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్
– బంగారు తెలంగాణ దిశగా అడుగులు
హైదరాబాద్,జూన్ 1(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.ఇదే సమయంలో ఆంధ్రాపార్టీలు తెలంగాణలో కనుమరుగుకానున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు కావడంతో పాటు టిఆర్‌ఎస్ పార్టీ అప్రతిహతంగా ఎదిగి పోవడం కూడా అంతే వేగంగా జరిగింది. రాజకీయంగా ఈ రెండేల్‌ల్లో టిఆర్‌ఎస్ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేకపోయారు. ఇటీవలి పాలేరు ఉప ఎన్నికల వరకు అన్ని ఎన్నికల్లోనూ విజయం టిఆర్‌ఎస్ సొంతమయ్యింది. ఇకపోతే అనేకమంది ఎమ్మెల్యేలు, నాయకులు ఆయా పార్టీలను వీడి టిఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా తెలంగాణ నుంచి ఉన్న ఏకైక టిడిపి ఎంపి మల్లారెడ్డి కూడా టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ రెండేళ్ల ప్రస్థానంలో రాజకయీంగా టిఆర్‌ఎస్ బాగా బలపడిందనే చెప్పాలి. అలాగే సిఎం కెసిఆర్‌కు ఎదురొడ్డి మాట్లాడే ధైర్యం చేసే నాయకుడు లేకుండా పోయాడు. చైతన్యానికి మారుపేరుగా నిలిచిన ఖమ్మం జిల్లాలో సైతం టిఆర్‌ఎస్ బాగా బలపడిందనడానికి పాలేరు ఉప ఎన్‌ఇనక నిదర్శనం. అక్కడ ఉన్న నేతలంతా చివరకు వైకాపా ఎంపి, ఎమ్మెల్యేలతో సహా టిఆర్‌ఎస్ గూటికి చేరారు. టిఆర్‌ఎస్ గూటిలోకి రాకుంటే దిక్కు లేదన్న చందంగా ఇతర పార్టీ పరిస్తితి మారిపోయింది. దీంతో కాంగ్రెస్, టిడిపిల నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ వచ్చాయి. ఈ రెండేళ్లలో ఎన్నో రాజకీయ పరిణామాలు సంభవించాయి. అధికారం తెచ్చిన ఊపును తొలి ఏడాదితో పాటు రెండో ఏడాదిలోనూ కొనసాగించిన టీఆర్‌ఎస్ రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. దాదాపు అన్ని జిల్లాలోని అన్ని పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి పెద్ద ఎత్తున వలసలు వెల్లువెత్తాయి. ఇక చేరికలు అయిపోయాయనుకుంటున్న తరుణంలో ఎంపి మల్లారెడ్డి బుధవారం సిఎం కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో టిడిపి దాదాపుగా ఖాళీ అయినట్లే భావించాలి. ఇకా బిజెపి తప్ప కాంగ్రెస్ నుంచి కూడా భారీగా చేరికలు సాగాయి. మరోవైపు రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచిన నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా టిఆర్‌ఎస్‌లో చేరుతారన్నప్రచారం జోరుగా సాగుతోంది. ఈ రెండేళ్లలో ఎన్నో రాజకీయ పరిణామాలు సంభవించాయి. అధికారం తెచ్చిన ఊపును తొలి ఏడాదితో పాటు రెండో ఏడాదిలోనూ కొనసాగించిన టీఆర్‌ఎస్ జిల్లా రాజకీయాల్లో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని సంపాదించగా, మొన్నటి వరకు జిల్లాలో కింగ్‌మేకర్స్‌గా ఉన్న కాంగ్రెస్ నేతలు కుదేలయిపోయారు. సార్వత్రిక ఎన్నికల్లో సగం అసెంబ్లీ సీట్లలో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకులు ఆ విజయాలతో సరిపెట్టుకుని ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారు. బిగ్‌షాట్స్ ఉన్నా జిల్లాలో హస్తం పార్టీ ఇంకా ట్రబుల్స్‌లోనే ఉండిపోయింది. కేంద్రంలో అధికారంలోనికి వచ్చిన బీజేపీ మాత్రం రాష్ట్రంలో ఇంకా సంస్థాగత నిర్మాణం విషయంలో పెద్దగా ముందడగు వేయడం లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని చెపుతున్న కమలనాథులకు రాష్ట్ర రాజకీయాలు గుబులునే మిగుల్చుతున్నాయి. వైఎస్సార్‌సీపీ కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కష్టపడాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పూర్తిస్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆయా పార్టీలు ఉనికిని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నల్లగొండ,వరంగల్, నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు ఉనికి కోసం పాకులాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అటు రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోనూ పెద్ద ఎత్తున కేడర్ టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తెలుగుదేశం నేతలున్నారు. పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటలు పెద్ద ఎత్తున ఉండ డంతో ఏం చేయాలో పాలుపోని స్థితి ఏర్పడింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో కూడా తెలుగుతమ్ముళ్లకు అంతు పట్టడం లేదు. రేవంత్ లాంటి వాళ్లు స్వరం పెంచినా ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిన కరారణంగా ఆయనపై అవినీతి లీడర్ ముద్ర బాగా పడింది. పూర్తిగా అంతర్మథనంలో ఉన్న ఆ పార్టీకి ఈ రెండేళ్లలో టీఆర్‌ఎస్ షాక్ విూద షాక్ ఇవ్వగా, ఒకటి, రెండు సందర్భాల్లో సొంత పార్టీ నేతల వైఖరి వల్ల కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. కేంద్రంలో అధికారంలోనికి వచ్చిన పార్టీగా భారతీయ జనతా పార్టీ గత రెండేళ్లలో చెప్పుకోదగిన ఫలితాలేవీ సాధించలేదు. నరేంద్రమోదీ హవాతో కేంద్రంలో అధికారం చేపట్టిన ఆ పార్టీనే రాష్ట్రంలో కూడా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మారుతుందని మొదట్లో చర్చ జరిగినా, క్రమంగా ఆ చర్చ పక్కకు జరిగింది. గ్రామస్థాయిలో పార్టీ కోసం పనిచేసే కేడర్ లేకపోవడం కమలనాథులకు గుబులునే మిగులుస్తోంది. పార్టీ కేంద్రంలో అధికారంలోనికి వచ్చినా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం,రాష్ట్రం కోసం కేంద్రం నుంచి పెద్దగా లాభపడే కార్యక్రమాలు చేయకపోవడం దానికి మైనస్‌గా మారింది. ఇక, కమ్యూనిస్టు విషయానికి వస్తే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సీపీఎం, సీపీఐలు ఇప్పుడు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పూర్తిగా వెనకబడ్డాయి. మొన్నటి పాలేరు ఉప ఎన్నిక వాటి ఉనికి ఏమాత్రమో చాటింది. గత ఎన్నికలలో కాంగ్రెస్ మద్దతుతో ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకున్న సీపీఐ ఎప్పటిలాగే పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమైంది. సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండేళ్లు గడుస్తున్నా తమకు పట్టున్న ఒకటి, రెండు నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీ కేడర్‌ను పెంచుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలుగా కార్మిక, కర్షక, శ్రామిక పోరాటాలకు ఆ పార్టీలు తమ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌కి రెండేళ్ల రాజకీయ కాలచక్రం మంచి అనుభూతులనే మిగిల్చింది. సార్వత్రిక ఎన్నికల సమయానికి సాధారణ స్థాయిలోనే ఉన్న టీఆర్‌ఎస్ అధికారమనే అండతో పూర్తిస్థాయిలో పట్టు బిగించింది. దాదాపు అన్ని జిల్లాలోని పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు వచ్చాయి. ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఏ కోణంలో చూసినా గులాబీ దండుదే ఆధిపత్యంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కూడా మరింత పర్యవేక్షణ ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అధికారంలోనికి వచ్చి రెండేళ్లయినా పదవీయోగం రాలేదన్న టీఆర్‌ఎస్ నేతల నిరుత్సాహం, రెండేళ్ల పాలనలో ప్రజలకు అందిన ప్రగతి ఫలాలపై విూమాంస మినహా వరుస ఎన్నికల్లో లభిస్తున్న విజయాలు, పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు అధికార గులాబీ సైన్యాన్ని రెండేళ్ల తర్వాత కూడా ఉత్సాహంలో ఉంచాయని రాజకీయ పరిశీలకులంటున్నారు. ఈ రెండేళ్లలో జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి అచ్చి వచ్చిన సందర్భమేదైనా ఉందంటే… అది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రమే. నల్లగొండ జిల్లాలో మంచి పలుకుబడి ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ ఎన్నికలలో అధికార టీఆర్‌ఎస్‌ను కంగు తినిపించి కాంగ్రెస్ శ్రేణుల్లో భవిష్యత్‌పై భరోసాను కల్పించారు. కానీ, ఆ తర్వాతి పరిణామాలు ఆ పార్టీకి మళ్లీ చేదు అనుభవాలనే మిగులుస్తున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా టిఆర్‌ఎస్‌లో చేరుతారన్న ప్రచారం కాంగ్రెస్‌కు చేదుగుళిక కానుంది. అధికార టీఆర్‌ఎస్ ప్రజా ఉద్యమాలు నిర్వహించడంలో ముందుండగా కాంగ్రెస్ నేతలు క్రియాశీలంగా వ్యవహరించలేకపోతున్నారు. ఆ పార్టీ కోలుకునేందుకు చాలా కాలమే
పడుతుందని రాజకీయ వర్గాల అంచనా.




