ఆంధ్రుల పెత్తనం సహించం

1

– సెక్షన్‌ 8 మోసపూరిత కుట్ర

– కోదండరామ్‌

హౖెెదరాబాద్‌,జూన్‌23(జనంసాక్షి): సెక్షన్‌-8ను అడ్డుపెట్టుకుని తెలంగాణపై సీమాంధ్ర నాయకులు పెత్తనం చెలాయించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని పొలిటికల్‌ జెఎసి ఛైర్మన్‌ ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ఓటుకునోటు వ్యవహారాన్ని పక్కకు తప్పించే కుట్రలో ఇప్పుడు దీనిని తెరపైకి తీసుకుని వచ్చారన్నారు. హైదరాబాద్‌పై సెక్షన్‌-8 అమలుపై వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. సెక్షన్‌-8 పరిధి చాలా చిన్నది. గవర్నర్‌ తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌పై హక్కులంటే తీవ్ర ప్రతిఘటన చర్యలుంటయని ఆయన పేర్కొన్నారు. సెక్షన్‌ 8ను అడ్డుపెట్టుకుని తెలంగాణపై ఏపీ నాయకులు పెత్తనం చెలాయించాలని చూస్తే అంగీకరించే ప్రసక్తి లేదని కోదండరామ్‌ హెచ్చరించారు. హైదరాబాదులో ఇప్పటి వరకు శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగలేదని అలాంటప్పుడు సెక్షన్‌ 8 ఎందుకని ప్రశ్నించారు. అవినీతి కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడనిఅన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికి బయటపడే మార్గంలేక ఏపీ సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత సమస్యను ఆంధ్ర ప్రజల సమస్యగా సృష్టిస్తున్నడని రాజకీయ విశ్లేషకులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం సెక్షన్‌-8ను అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు.