ఆంధ్రోళ్లపై ఈగ కూడా వాలలేదు

2

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,జనవరి 5(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రోళ్లపై ఈగ వాలనివ్వలేదని ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. కొందరు రాజకీయ లబ్ది కోసం అపోహలు సృష్టిస్తున్నారని వారికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావులు తరుచూ కలుస్తుండటాన్ని సైతం కొందరు విమర్శించడం దారుణమని మండిపడ్డారు. వారికి ఇద్దరు సీఎంలు కలిసి పనిచేయడం వారికిష్టంలేదని అన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు సహృద్భావంతో కలిసి పనిచేయడం చాలామందికి నచ్చడం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇరువురు సీఎంలు  ఉద్యమ సమయంలో తెలంగాణను అడ్డుకున్న ఆంధ్రా నేతలను పరుష పదజాలంతో తాము విమర్శించిన విషయం వాస్తమేనని.. కానీ తమకు ఎవరిపైనా కక్ష, ద్వేషం లేవన్నారు. ఇటీవల తెరాసలో చేరిన విజయరామారావు అనుచరులు కొంతమంది కేటీఆర్‌ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. 2014 ఎన్నికల్లో హైదరాబాద్‌ ప్రజలు తమను నమ్మలేదని, అందుకే కేవలం రెండు సీట్లను మాత్రమే గెలిపించారని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్ర ప్రజలు ఆత్మ విమర్శ చేసుకుని ఓట్లు వేయాలన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీమాంధ్రులపై ఈగ వాలనీయకుండా శాంతిభద్రతలు నిర్వహించామన్నారు. రాష్ట్ర విభజన వల్లే ఏపీకి అమరావతి నగరం, ఐఐటీ, ఎయిమ్స్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు దక్కాయని పేర్కొన్నారు.