ఆగని మరణ మృదంగం

` మహారాష్ట్రలో మరో 2 ఆసుపత్రుల్లోనూ అదే పరిస్థితి..
` 24 గంటల్లో 23 మరణాలు
` మూడు రోజుల్లో 72 మంది మృతి
` వరుస మరణాలపై బాంబే హైకోర్టు సీరియస్‌
ముంబై(జనంసాక్షి):మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. వివిధ కారణాలతో రోగులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్న నాందేడ్‌ ఆసుపత్రిలో 31 మంది రోగులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శంభాజీనగర్‌లోని జీఎంసీహెచ్‌లోనూ పలువురు రోగులు మృత్యువాతపడ్డారు. తాజాగా రాష్ట్రంలోని మరో రెండు ఆసుపత్రుల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. నాగ్‌పూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి లో 24 గంటల వ్యవధిలో 14 మంది మరణించినట్లు ఆసుపత్రి అధికారులు బుధవారం వెల్లడిరచారు. ఆసుపత్రిలో 1900 పడకల సామర్థ్యం ఉందని, రోజూ సగటున 10 నుంచి 20 మంది రోగులు మరణిస్తున్నారని జీఎమ్‌సీహెచ్‌ డీన్‌ డాక్టర్‌ రాజ్‌ గజ్భియే తెలిపారు. అదేవిధంగా, నగరంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి లో 24 గంటల్లో తొమ్మిది మరణాలు సంభవించినట్లు ఆసుపత్రి సీనియర్‌ వైద్యులు తెలిపారు. ఈ ఆసుపత్రిలో 800 పడకల సామర్థ్యం కలిగి ఉందని, ప్రతిరోజూ సగటున ఆరుగురు రోగుల మరణిస్తున్నట్లు వివరించారు. కాగా, ఆ రెండు ఆసుపత్రుల్లో కలిసి 24 గంటల వ్యవధిలో మొత్తం 23 మరణాలు నమోదయ్యాయి.కొద్దిరోజుల క్రితం థాణే ఆసుపత్రిలో 36 గంటల్లో 22 మంది రోగులు మరణించిన ఘటన మరవకముందే.. మొన్న నాందేడ్‌ లో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో 48 గంటల వ్యవధిలో ఏకంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో 12 మంది నవజాత శిశువులు ఉండటం అందర్నీ కలిచివేసింది. ఆ తర్వాత ఛత్రపతి శంభాజీనగర్‌లోని జీఎంసీహెచ్‌లో 24 గంటల్లో 18 మరణాలు నమోదయ్యాయని ఓ అధికారి తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు రోజుల వ్యవధిలోనే వివిధ కారణాలతో 72 మంది ప్రాణాలు కోల్పోయారు.కాగా, ఆసుపత్రుల్లో రోగుల వరుస మరణాలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ దవాఖానాల్లో వసతులలేమి, సిబ్బంది కొరతే ఈ మరణాలకు కారణమని బాధిత కుటుంబాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ విమర్శిస్తున్నారు.
ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్‌
మహారాష్ట్ర ఆసుపత్రుల్లో మృత్యుఘోషను బాంబే హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. నాందేడ్‌తోపాటు ఛత్రపతి శంభాజీనగర్‌ ఆసుపత్రుల్లో వరుసగా రోగులు మృత్యువాతపడటాన్ని సుమోటోగా స్వీకరించింది.చీఫ్‌ జస్టిస్‌ డీకే ఉపాధ్యాయ, జస్టిస్‌ ఆరిఫ్‌ ఎస్‌ డాక్టర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌.. బడ్జెట్‌లో ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంత కేటాయించింది? పెట్టిన ఖర్చు..? తదితర వివరాలు తెలపాలని అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది.
గత మూడు రోజులుగా మహారాష్ట్రలోని ప్రభుత్వాసుపత్రుల్లో మృత్యు ఘోష వినిపిస్తోంది. నాందేడ్‌ ఆసుపత్రిలో 31 మంది, ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఆసుపత్రిలో 18 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడిరచారు. గంటల వ్యవధిలో పదుల సంఖ్యలో రోగులు మృత్యువాతపడటం రాష్ట్రాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ వ్యవహారంపై మోహిత్‌ ఖన్నా అనే న్యాయవాది బాంబే హైకోర్టుకు లేఖ రాశారు. దానిని పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. ఓ పిటిషన్‌ దాఖలు చేయాలని, తద్వారా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. ఆసుపత్రుల్లో ఖాళీలు, ఔషధాల లభ్యత, ప్రభుత్వం ఖర్చుచేస్తున్న నిధులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని సూచించింది.అనంతరం మధ్యాహ్నం (బుధవారం) సెషన్‌లో ఇదే అంశాన్ని ప్రస్తావించిన బాంబే హైకోర్టు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఆసుపత్రి పడకలు, సిబ్బంది, అత్యవసర ఔషధాల కొరత ఉన్నట్లు వైద్యులు చెప్పడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడిరది. ఈ వ్యవహారంపై శుక్రవారం విచారణ జరుపుతామని.. ఆలోపు వివరాలన్నీ తమ ముందు ఉంచాలని ఆదేశించింది.మరోవైపు ఆసుపత్రుల్లో వరుస మరణాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఇప్పటికే ప్రకటించారు. అయితే, అసుపత్రుల్లో సిబ్బంది, ఔషధాల కొరత ఉందని వస్తోన్న వార్తలను ఆయన తోసిబుచ్చారు.