ఆగస్టులో కేంద్ర మంత్రివర్గ విస్తరణ!

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారు అయింది. వచ్చే నెల (ఆగస్టు)లో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. కొత్తగా పలువురికి కేబినెట్‌ బెర్త్‌లు దక్కనున్నాయి. అలాగే మంత్రుల శాఖల్లోనూ మార్పులు, చేర్పులు జరగే అవకాశం ఉంది. మహాఘట్‌బంధన్‌ నుంచి విడిపోయి బీజేపీతో జతకట్టిన జేడీయూ కేబినెట్‌లో చేరనుంది. జేడీయూ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్‌ ఉంది. ఓ వైపు కేంద్ర సమచారా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడం, అనిల్‌దవే ఆకస్మిక మరణంతో  కేబినెట్‌లో ఖాళీలు ఏర్పడ్డాయి.

దీంతో రక్షణ, పర్యావరణ వంటి కీలక శాఖలకు పూర్తి స్థాయి మంత్రులు లేరు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, శాస్త్ర, సాంకేతిక శాఖమంత్రి హర్షవర్ధన్ ఆ రెండు శాఖలను అదనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌లో పలు మార్పులు-చేర్పులు జరగవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం అదనపు శాఖలు నిర్వహిస్తున్న కేంద్ర మంత్రులకు ఆ భారం నుంచి సడలింపు ఇవ్వొవచ్చునని, కొత్తవాళ్లకు అవకాశం కల్పించవచ్చునని తెలుస్తోంది.