ఆచార్య జయశంకర్ స్ఫూర్తి అనుసరణీయం
నివాళి అర్పించిన ఎన్‌ఆర్‌ఐలు
లండన్,ఆగస్ట్6(జనం సాక్షి ): ఆచార్య జయశంకర్ సార్ జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. లండన్ ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ యూకే ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు ఆధ్వర్యంలో, సంయుక్త కార్యదర్శి సురేష్ గోపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల, జయశంకర్ సార్ సేవలను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ సార్ పాత్ర గొప్పదని, ఆయన చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పని చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన సంతోష సందర్భంలో సార్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. జయశంకర్ సార్ రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ప్రవాస తెలంగాణ సంఘాలన్నీ సార్ మానస పుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా మనమంతా తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు. జయశంకర్ సార్ కలలు గన్న తెలంగాణ కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమని, అన్ని సందర్భాల్లో టీఆర్‌ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్నారై విభాగం నేతలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.