ఆటలను ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాలు
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
గురువారం మండలంలోని మాటేడు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని రాష్ట్ర మంత్రి దయాకర్ రావు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, దీనిలో భాగంగా ఆటలు ఆడుకునేందుకు గ్రామాల్లో సకల సౌకర్యాలతో మైదానాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఊరికో ‘తెలంగాణగ్రామ క్రీడా ప్రాంగణం’ పేరుతో ఆట స్థలాలను నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
గ్రామాల్లో క్రీడల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల గ్రామాలు, 5వేల వార్డుల్లో మొత్తంగా 24 వేల గ్రామీణ క్రీడా కమీటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రీడా ప్రాంగణం చుట్టూ రెండు వరుసల్లో మొక్కలతో బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
చిన్నప్పుడు ఆటలే ప్రధానం.ఆటల ద్వారా మానసిక ఉల్లాసం కలగడంతోపాటు శారీరక దృఢత్వానికి దోహదం చేస్తాయన్నారు. క్రీడలతో స్నేహానుబంధాలు ఏర్పడుతాయని, అలాంటిది గ్రామాల్లో స్థలం లేక, సమయం వెచ్చించక పిల్లలు ఆటలకు దూరమవుతున్నారన్నారు. గ్రామాల నుంచి మొదలుకొని పట్టణాల వరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఒక ఆటస్థలం ఏర్పాటుకు నిర్ణయించిందన్నారు
వీటికి ‘తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణం’ అని ఆటస్థలాలకు పేరు పెట్టామన్నారు. ఈ క్రీడా ప్రాంగణాలలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, షటిల్ వంటి క్రీడలు ఆడుకోవచ్చన్నారు. ఒక్కో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రతిభకు కొదవలేదని, వారిని ప్రోత్సహిస్తే జాతీయస్థాయి క్రీడాకారులుగా మారుతారని ఆకాంక్షించారు. క్రీడలతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, నిత్యం ప్రజల కోసం ఆలోచించే సీఎం రాష్ట్రంలో ఉండటం గర్వకారణమన్నారు. ఏ దేశంలో లేని పథకాలు తెలంగాణ లో ఉన్నాయని, వాటిని చూసి కేంద్రం పైసా విదిల్చక పోయినా అనేక అవార్డులు అందజేసిందని తెలిపారు.
అనంతరం డివిజన్ కేంద్రంలోని లయన్స్ క్లబ్ లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత ఉద్యోగ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి దయాకర్ రావు పరిశీలించారు. టెట్ శిక్షణ విజయవంతంగా ముగిసిన తరుణంలో యువత తో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఉద్యోగం సాధించే వద్దకు విశ్రమించ వద్దని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు,
గిరిజన సంక్షేమ శాఖ డిడి దిలీప్ , ఆర్డీవో రమేష్, ఏపీడీ దయాకర్, మాటేడు గ్రామ సర్పంచ్ వల్లపు శోభ యాకయ్య, ఎంపీటీసీ దీకొండ కవిత, పిఎసిఎస్ చైర్మన్ హరి ప్రసాద్, డైరెక్టర్ జనార్దన్ రాజు, ఉప సర్పంచ్ పినాకపాణి, నాయకులు కొంరారెడ్డి, బుచ్చయ్య, సముద్రాల శ్రీనివాస్, ఎర్ర సంపత్, సురేందర్రాజు , మహంకాళి అశోక్, ఆకుల ప్రశాంత్ రమేష్ వెంకన్న ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.