ఆటవిక రాజ్యం అంతానికి ఎన్నికలు

2
– ప్రధాని మోదీ

– ప్రధాని పదవికి మోడీ పనికిరాడు

పాట్నా, అక్టోబర్‌ 9 జనంసాక్షి):

బీహార్‌లో ఎన్నికలు ఇప్పుడు  కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మాత్రమే జరగట్లేదని, బిహార్‌ల్లో ఆటవిక పాలన అంతానికి ఈ ఎన్నికలని  ప్రధాని మోడీ అన్నారు. ఆటవిక రాజ్యాన్ని పారదోలే సమయం ఆసన్నమైందన్నారు. యువత దీనిని అవకాశంగా తీసుకోవాలని అన్నారు. అభివృద్దికి ఓటేయాలని అన్నారు. మరో మూడు రోజుల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ససారాంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. సీఎం నితీష్‌ కుమార్‌, ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌యాదవ్‌పై నిప్పులు చెరిగారు. ఇన్నాళ్లు అభివృద్ధి గురించి వారిద్దరూ ఎప్పుడైనా ఆలోచించారా? రాష్ట్రాభివృద్ధిని కోరుకుంటున్నామని చెబుతున్న వారిద్దరూ ఇన్నాళ్లు ఎందుకు కలవలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక బీహార్‌ ప్రజలు వారిని నిలదీయాల్సిన సమయం వచ్చిందన్నారు. లాలు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు? లాలు పలు కేసుల్లో ఇరుక్కున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థ కూడా ఆయనను ఎన్నికల నుంచి బహిష్కరించింది. న్యాయ వ్యవస్థ బహిష్కరించిన లాలుకు ఓట్లు వేయొద్దని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జితన్‌రామ్‌ మాంఝీ తక్కువ కాలంలోనే సమర్థ పాలన ఎలా ఉంటుందో బీహర్‌ ప్రజలకు చూపించారని గుర్తు చేశారు. ఇకపోతే బిహార్‌లో ఎన్నికల తరుణం దగ్గర పడుతున్న కొద్దీ ప్రత్యర్థుల మధ్య విమర్శలు శ్రుతి మించుతున్నాయి. ప్రధాని పదవికి మోదీ సరిపోరని ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ విమర్శించారు. పట్నాలో విలేకరులతో మాట్లాడుతూ మోదీ తనను సైతాన్‌ అని సంబోధించి అవమానపరిచారని అసలు ఆయనే బ్రహ్మపిశాచి అని లాలూ దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన ప్రసంగంలో మత సహనం, భిన్నత్వంలో ఏకత్వం లాంటి విషయాల గురించి చెప్పింది ప్రధానిని ఉద్దేశించేనన్నారు. గురువారం బిహార్‌లోని ముంగేర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ లాలూ గురించి మాట్లాడుతూ.. ‘సైతాన్‌కు సరైన చిరునామా దొరికింది. అలాంటి వ్యక్తి రాష్ట్ర పాలకుడిగా మారేందుకు ప్రజలు అంగీకరించరనుకుంటున్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై లాలూ పై విధంగా స్పందించారు. ‘సైతాన్‌’ వ్యాఖ్యలపై ఆర్జేడీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 12 వ తేదీ నుంచి బిహార్‌లో ఐదు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.