ఆటోవాలా పోరుకు కేజ్రీవాల్‌ సంఘీభావం

2
బెంగళూరు,జనవరి31(జనంసాక్షి):బెంగళూరు ఆటోడ్రైవర్ల సంఘం చేపట్టిన పోరుకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సంఘీభావం తెలిపారు. 15 రోజుల సరి- బేసి విధానం తర్వాత ఢిల్లీలో మళ్లీ పెరిగిన కాలుష్యం కారణంగా అనారోగ్యానికి గురైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుతం బెంగళూరులో ప్రకృతి చికిత్స చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం చికిత్సకు కాస్త విరామమిచ్చిన ఆయన తనకు అలవాటైన ఆందోళనబాటపట్టారు. బెంగళూరు ఆటోడ్రైవర్ల సంఘం ఆదివారం నిర్వహించిన భారీ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సభా ప్రాంగణానికి ఆటోలో వచ్చిన ఆయనకు ఆటోడ్రైవర్లు సాదర స్వాగతంపలికి, డ్రైవింగ్‌ లైసెన్స్‌ మంజూరు, పోలీసుల వేధింపులు తదితర సమస్యలు చెప్పుకున్నారు. ఆటోవాలల సంక్షేమంకోసం ఆప్‌ సర్కారు చేపడుతోన్న పథకాలను వివరించిన కేజ్రీవాల్‌.. ఢిల్లీని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో 15 ఏళ్ల కాలపరిమితి దాటిన ఆటోలపై నిషేధం విధించామని, అయితే ఆటో డ్రైవర్లను దృష్టిలో ఉంచుకుని రద్దుచేసినవాటి స్థానంలో కొత్త కాలుష్యరహిత వాహనాలను పంపిణీచేశామని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని సిద్ధరామయ్య సర్కార్‌ కూడా ఆ మేరకు ఆటోవాలాల సమస్యలను పరిష్కరించాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు.