ఆడపిల్లలకు బృహత్తర పథకం సుకన్య సమృద్ధి యోజన: తపాలా డివిజన్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు

గరిడేపల్లి, సెప్టెంబర్ 7 (జనం సాక్షి):కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లలకు బృహత్తర పథకమని సూర్యాపేట డివిజన్ తపాలా సూపరిండెంట్  వడ్లమూడి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఉప తపాలా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ సర్కిల్  పరిధిలో సెప్టెంబర్ 2వ తారీఖు నుండి 17 వ తారీఖు వరకు సుకన్య ఖాతాల పక్ష మహోత్సవంలో  భాగంగా పెద్ద ఎత్తున సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు సేకరించేందుకు డివిజన్  పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నామని అన్నారు . ఈ ప్రచారంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలలతో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. అప్పుడే పుట్టిన ఆడ పిల్లలు మొదలుకొని 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరికీ  ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని  కోరారు.  ఈ పథకంలో నెలకు రూ.250 నుండి సంవత్సరంలో రూ ఒక లక్షా యాభై  వేల వరకు ఆడపిల్లల పేరు మీద వారి తల్లిదండ్రులు  డిపాజిట్ చేయవచ్చని తెలిపారు.  పేద పిల్లలకు దాతలు సహకారం అందిస్తే ఈ ఖాతాలను ఫ్రీగా ప్రారంభం చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు సూర్యాపేట డివిజన్ మొత్తం 35 వేల సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరవడం జరిగిందని ఈ పదిహేను రోజుల్లో మరో ఐదువేల ఖాతాలను ప్రారంభించేందుకు తపాలా సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారని  తెలిపారు.ఈ అవకాశాన్ని ఆడపిల్లలున్న  తల్లిదండ్రులంతా  సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్బంగా మండలంలోని పొనుగోడు గడ్డిపల్లి గ్రామాల్లో తపాలా కార్యాలయాల్లోని  పరిధిలో   ఇంటింటి ప్రచారం ప్రచారం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎం దారావత్తు చందూలాల్ నాయక్, మెయిల్ వర్షల్ గొల్లపల్లి కోటయ్య,బీపీఎం,ఏబీపీఎం,డాకాసేవక్ లు తదితరులు పాల్గొన్నారు.