ఆడవాళ్లు తప్పకుండా క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలి
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహనరాలీ ప్రారంభించిన కవిత
హైదరాబాద్,అక్టోబర్9 (జనంసాక్షి): హైదరాబాద్‌లోని ఎమ్‌ఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌పై ఆస్పత్రి యాజమాన్యం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ వాక్‌ను టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత మాట్లాడుతూ.. గతంలో 60 ఏండ్లు పైబడిన వారు క్యాన్సర్ బారిన పడేవారని, ఇప్పుడేమో 30 ఏండ్లకే క్యాన్సర్ వస్తుందన్నారు. ఆడపిల్లలకు తప్పకుండా ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించడంతో పాటు, జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రతి మహిళ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎమ్‌ఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన ఆస్పత్రి ఇంచార్జీ జయలలితకు ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలిపారు.