ఆడిలైడ్ వన్డేలోనూ సత్తాచాటుతాం
– భారత్‌పై ఫించ్ చెలరేగుతాడు
– ఆస్టేల్రియా వైస్ కెప్టెన్ అలెక్స్ కేరీ
ఆడిలైడ్, జనవరి14(జనంసాక్షి) : భారత్‌తో ఆస్టేల్రియా తలపడే రెండు వన్డేల్లోనూ తమ సత్తాను చాటుతామని, కెప్టెన్ అరోన్ ఫించ్ చెలరేగుతాడని ఆ జట్టు వైస్ కెప్టెన్ అలెక్స్ కేరీ ధీమా వ్యక్తం చేశాడు. అడిలైడ్ వేదికగా మంగళవారం ఉదయం 8.50 గంటల నుంచి రెండో వన్డే ప్రారంభంకానుండగా.. సోమవారం అలెక్స్ విలేకరులతో మాట్లాడారు. గత శనివారం ముగిసిన తొలి వన్డేలో 11 బంతులు ఎదుర్కొన్న అరోన్ ఫించ్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ఔటయ్యాడు. ఈ వన్డేనే కాదు.. భారత్‌తో ఇటీవల ముగిసిన టీ20, టెస్టు సిరీస్‌లోనూ ఈ ఓపెనర్ ఘోరంగా విఫలమయ్యాడు. ఎంతలా అంటే.. అతను చివరిగా ఆడిన 11ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక స్కోరు 47కాగా.. ఏకంగా ఏడుసార్లు 7 పరుగులలోపే పెవిలియన్ చేరాడు. ఆస్టేల్రియా టీమ్‌లో గర్వించదిగిన ఆటగాళ్లలో అరోన్ ఫించ్ కూడా ఒకరని అలెక్స్ పేర్కొన్నారు. అతను భారీ స్కోరుతో జట్టుకి విజయాన్ని అందించడం ద్వారా ఫామ్ అందుకోవాలని తాను ఆశిస్తున్నానని అన్నారు. నెట్స్‌లో అతను శ్రమిస్తున్న తీరు చూస్తుంటే..? తప్పకుండా భారత్‌పై చివరి రెండు వన్డేల్లో భారీ స్కోరు సాధించేలా కనిపిస్తోందని అలెక్స్ తెలిపారు. మైదానంలోనే కాదు.. వెలుపల కూడా అతను మంచి నాయకుడని కెప్టెన్‌కి మద్దతుగా అలెక్స్ కేరీ నిలిచాడు. జింబాబ్వేతో గత ఏడాది జూలైలో జరిగిన టీ20 మ్యాచ్‌లో కేవలం 76 బంతుల్లోనే అరోన్ ఫించ్ 172 పరుగులు చేశాడు. కానీ.. ఆ తర్వాత ఇప్పటి వరకూ అన్ని ఫార్మాట్లలో కలిపి 25 ఇన్నింగ్స్‌లు ఆడిన ఫించ్.. సాధించింది రెండు అర్ధశతకాలు మాత్రమే..!