ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించాలి
బేషాజాలకు పోవద్దు
సమస్యను గుర్తించాలి
సర్కార్‌కు కోదండరాం హితవు
వరంగల్, సెప్టెంబర్ 8(జనంసాక్షి) :
తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలను పరామర్శించాలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని టీ.జేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు.దుఖ:ల్లో ఉన్న కుటుంబా ఇళ్లకు సర్కారు వెళ్లాలన్నారు. సమస్యను గుర్తించి పరామర్శలకు వెళితే ఆత్మహత్యలు పురుగుతాయన్నది అపోహేనని, వెళ్ళనందుకు బలవన్మరణాలు తగ్గలేదన్నారు.
ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని పట్టించుకోకుండా వ్యవహరించడం సరైందికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం వరంగల్‌లో జరిగిన ఓ సెమినార్‌లో కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తే ఆత్మహత్యలు తగ్గుతాయని అన్నారు. రైతుల తరఫున పోరాడేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, బతికుండి కొట్లాడాలని కోదండరాం సూచించారు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు ఆయా కుటుంబాలవద్దకు ప్రభుత్వ అధికారులు వెళ్లి పరామర్శించాలని, వారికి భరోసా ఇచ్చి నష్టపరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోదండరాం సూచించారు.