ఆత్మహత్య కాదు.. హత్యే!

1
– ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ,జనవరి19(జనంసాక్షి):   హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో విద్యార్థిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ క్షమాపణ చెప్పాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ డిమాండ్‌ చేశారు. రెండు రోజుల క్రితం సెంట్రల్‌ యూనివర్శిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విద్యార్థులు పలు చోట్ల ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఢిల్లీలో కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కేజీవ్రాల్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనపై మోదీ క్షమాపణలు చెప్పాలన్నారు. రోహిత్‌ మృతి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీకి రాసిన లేఖ వల్లనే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. లేఖ రాసిన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.మోదీ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి సహకరించడం లేదని కేజీవ్రాల్‌ విమర్శించారు.  ఈ ఘటనను ఆయన ప్రభుత్వ హత్యగానే పరిగణించాలని ఆయన అన్నారు. బలహీన వర్గాల వారిపై బిజెపి ప్రభుత్వానికి సరైన విలువ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ ఈ ఘటనకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రోహిత్‌ది ఆత్మహత్య కాదు.. హత్యేనని ధ్వజమెత్తారు. సామాజిక, ప్రజాస్వామ్య హత్యగా వర్ణించారు కేజీవ్రాల్‌.