ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్
ఛండీఘడ్,జూన్18(జనంసాక్షి): భారీగా పంటనష్టపోవడంతో గతవారం పంజాబ్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. గురువారం ఉదయమే రాహుల్ రైతు సూర్జిత్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. సూర్జిత్ సింగ్ కొడుకు కుల్విందర్ సింగ్ మాట్లాడుతూ.. ‘మాకు సొంతంగా ఆరెకరాల పొలం ఉంది. మా నాన్న మరో 19 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాడు. భారీగా పంట నష్టపోయాం. ఫలితంగా రూ.13 లక్షల అప్పు మిగిలింది. భూమి యజమానులకు చెల్లించాల్సిన మొత్తం సైతం భారీగా ఉంది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు’ అంటూ రాహుల్‌కి వివరించాడు. దీనిపై రాహుల్ స్పందిస్తూ ఇది సూర్జిత్ సింగ్ ఒక్కడి కథే కాదని ఇలాంటి కష్టాలతో ఎందరో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశంలో ఇప్పుడున్న ప్రభుత్వం కార్పోరేట్లకు మేలు చేసేదిగా ఉందన్నారు. వారికి భూములు కట్టబెట్టే చట్టం తీసుకుని రావాలని చూస్తోందన్నారు. రైతులకన్నా కార్పోరేట్లకే విలువ ఉందన్నారు.