ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలకుసంక్షేమ పథకాల అమలుపై సమీక్ష

కరీంనగర్‌, నవంబర్‌ 5 : జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి వర్తింపచేసి వారిని ఆదుకోవాలని జెసి.అరుణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో డయల్‌ యువర్‌ కలెక్టర్‌  కార్యక్రమం అనంతరం ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాలకు సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. డిఆర్‌డిఏ ద్వారా అర్హులైన వారికి పెన్షన్లు, గృహానిర్మాణశాఖ ద్వారా గృహాల మంజూరు, పౌరసరఫరాల శాఖ ద్వారా దీపం కనెక్షన్లు, వివిధ ప్రభుత్వ కార్పోరేషన్‌ల ద్వారా వారి జీవనోపాధికి సంక్షేమ కార్యక్రమాలు వేగవంత చేయాలని ఆదేశించారు. అలాగే రైతుల ఆత్మహత్యలపై నివేదికలను వెంటనే సమర్పించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు జేసీ సుందర్‌ అబ్నార్‌, డిఆర్‌ఓ జె.సుధాకర్‌, జడ్పీ సిఇఓ చక్రధర్‌రావు, వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.