ఆదర్శ పాఠశాలల ప్రారంభానికి మరింత కాలం
హైదరాబాద్: ఆదర్శ పాఠశాలల ప్రారంభంలో మరింత సమయం పట్టవచ్చని మాధ్యమిక విద్యాశాఖ ముక్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పరోక్షంగా వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిపాదించిన 355 ఆదర్శ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి 110 పాఠశాలలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ జరుగుతోంది. ఇంటర్ ఫలితాలు విడుదల కార్యక్రమంలో పాల్గొన్న తివారీ ఈ విద్యా సంవత్సరం ఆదర్శపాఠశాలలు అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉందా అన్న విషయం పై అడిగిన ప్రశ్నకు స్పందించారు. పాఠశాలల నిర్మాణం టెండర్లలో జాప్యం ఇసుక కొరత తదితర కారణాల వల్ల ఆదర్శ పాఠశాలల ప్రారంభం అలస్యమయిందన్నారు. ఈ ఏడాదికి ఈ పాఠశాలలు ప్రారంభించాలా లేదా అనే అంశం పై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.