ఆదాయానికి మించి ఆస్తులు

అనంత సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో ఎసిబి సోదాలు
అనంతపురం,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): ఎసిబికి మరో అవినీతి చేప చిక్కింది. ఆదాయినికి మించి ఆస్తులు కలిగిన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు చేపటట్‌ఆరు. అనంతపురం జిల్లా కేంద్రంలోని పాపంపేటలో నివాసముంటున్న సబ్‌ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ నివాసంలో అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. కర్నూలు అనిశా డీఎస్పీ జయరామరాజ్‌, అనంతపురం డీఎస్పీ సురేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలతో కూడిన ప్రత్యేక బృందాలు ఐదు చోట్ల తనిఖీలు నిర్వహించాయి. లక్ష్మీనారాయణకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై సోదాలు నిర్వహిస్తున్నట్లు అనిశా అధికారులు పేర్కొన్నారు.ఏకకాలంలో సాగిన ఈ సోదాలలో రూ.12 లక్షల నగదు, తొమ్మిది ఇళ్ల స్థలాలు, నాలుగు నివాస గృహాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. బినావిూ పేర్లతో ఉన్న ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా కనగానపల్లికి చెందిన లక్ష్మీనారాయణ 1994లో రిజిస్ట్రార్‌ కార్యాలయంలో టైపిస్ట్‌గా విధుల్లోకి చేరారు. అనంతరం 2005లో సబ్‌రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం అనంతపురం అర్బన్‌ సబ్‌రిజిస్ట్రార్‌ -1గా విధులు నిర్వహిస్తున్నారు. సోదాల అనంతరం లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనిశా డీఎస్పీ పేర్కొన్నారు.