ఆదిలాబాద్ ఎంపిపై కన్నేసిన రాథోడ్
మరోమారు గట్టిప్రయత్నాల్లో ఇతరనేతలు
కాంగ్రెస్‌లో లోక్‌సభకోసం పెరిగిన పోటీ
ఆదిలాబాద్,ఫిబ్రవరి14(జనంసాక్షి): లోకసభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీలో ఆదిలాబాద్ స్థానంకోసం పోటీ పెరిగింది. కాంగ్రెస్ తరఫున పోటీదారుల సంఖ్య భారీగానే ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల అనంతరం స్తబ్ధుగా ఉన్న రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం ఎస్టీకి రిజర్వు కావడంతో గిరిజన తెగలోని లంబాడ, ఆదివాసీ వర్గాల్లో ఎవరికి టికెట్ లభిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం ఎస్టీకి రిజర్వు కాగా.. తూర్పు జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాలున్న పెద్దపల్లి పార్లమెంటు స్థానం ఎస్సీలకు రిజర్వు అయింది. ఇటీవలే నాలుగు జిల్లాల డీసీసీ అధ్యక్షుల నియామకాలు పూర్తిచేయగా.. ప్రాథమిక స్థాయిలో అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై సమావేశాలు నిర్వహిస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఆదిలాబాద్, ముథోల్ మినహా మిగిలిన బోథ్, నిర్మల్, ఖానాపూర్, సిర్పూర్ నియోజకవర్గాల్లో గట్టి పోటీనిచ్చింది. ఈ నాలుగుచోట్ల పార్టీ అభ్యర్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇక ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రంసక్కు గెలుపొందారు. దీంతో పార్లమెంటు పరిధిలో ఓటు బ్యాంకు ఉండడంతో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించితే విజయం తమదేనని ఆ పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేసిన రాఠోడ్ రమేశ్, గత ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసిన నరేష్‌జాదవ్, బోథ్ నుంచి పోటీచేసి ఓటమిపాలైన సోయం బాబురావులు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అధిష్ఠానం తమకే టికెట్ ఇస్తుందనే ఆశతో ఉన్నారు. గతంలో ఎంపీగా, జడ్పీ ఛైర్మన్‌గా పనిచేసిన రాఠోడ్ తనకు టిక్ఎట్ కోసం ప్యత్నాలు ముమ్మరం చేశారు. సోయం బాబురావు సైతం ఎంపీ స్థానంపై గురిపెట్టారు. ఆదివాసీల ఉద్యమానికి నాయకత్వం వహించిన సోయంకు ఆ వర్గాల నుంచి పూర్తిమద్దతు లభిస్తుందని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. గిరిజన మహిళా కోటాలో తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని అదే పార్టీకి చెందిన చారులత రాథోడ్ దరఖాస్తు చేశారు. వీరితో పాటుగా కాగజ్‌నగర్‌కు చెందిన సిడాం గణపతి, ఖానాపూర్‌కు చెందిన రవినాయక్, కరీంనగర్ జిల్లాకు చెందిన జాన్సన్ నాయక్‌లు ఆదిలాబాద్ టికెట్ కోసం దరఖాస్తులు సమర్పించారు. పెద్దపల్లి ఎంపీ స్థానానికి కాంగ్రెస్ నుంచి గోమాస శ్రీనివాస్, అద్దంకి దయాకర్, కె.సత్యనారాయణ, వరప్రసాద్, దుర్గాభవానీలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఆశావాహులు ఎవరికి వాళ్లు తమ అనుయాయుల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నా.. ఈ ఈ నెలాఖరు వరకు అధిష్ఠానం అభ్యర్థుల ప్రకటన పూర్తిచేయనుంది.