ఆదిలాబాద్‌ ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): అడువుల జిల్లా ఆదిలాబాద్‌లో చలిగాలులు వణికిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోయింది. వారం క్రితం కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదవగా.. క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఆదిలాబాద్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి విపరీతంగా పెరిగి పోయింది. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 8 గంటల వరకు చలి తగ్గడం లేదు. ఆదిలాబాద్‌లో గత ఏడాది అక్టోబర్‌ 31న కనిష్ఠ ఉష్ణోగ్రత 13.7డిగ్రీలు నమోదు కాగా.. ఈ ఏడాది అక్టోబర్‌ 31న కనిష్ఠ ఉష్ణోగ్రత 10.5 డిగ్రీలు నమోదైంది.నవంబర్‌ ప్రారంభంలోనే రాష్ట్రంలో చలి తీవ్రత రికార్డు స్థాయిలో పెరిగింది. ఎముకలు కొరికే చలికి జనం గజగజ వణికిపోతున్నరు. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో జనం ఇండ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నరు. ఉష్ణోగ్రతలు తక్కువగా రికార్డవుతుండటంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి మంటలు కాగుతున్నా, ఎండలో నిలబడినా వణుకు ఆగడంలేదు. అటు గ్రేటర్‌ హైదరాబాద్‌లో చలి ఉధృతమవుతున్నది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 46 నుంచి 55 శాతానికి పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న వారం రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని? శీతల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.