ఆధార్‌కార్డు కోసం ఇబ్బందులకు గురవుతున్న జనం
సంగారెడ్డి, జనవరి 19 : మెదక్ పట్టణంలో ఆధార్‌కేంద్రం వద్ద ఆధార్‌కార్డు దరఖాస్తు ఫారాలు ఇవ్వాలంటూ ప్రజలు నినాదాలు చేశారు. ఆధార్ కేంద్రం వద్ద దరఖాస్తు ఫారాలు ఇవ్వాల్సి ఉండగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆధార్ దరఖాస్తు ఫారాల కోసం ప్రజలు, విద్యార్థులు వరుసగా నిలబడ్డారు. మెదక్ ఆధార్ కేంద్రంలో ప్రతి రోజు 30 కుటుంబాలను ఆధార్‌లో చిత్రీకరణ, వారి వేలిముద్రల సేకరణ జరపాల్సి ఉండగా 50 కుటుంబాల వరకు ఆధార్ చిత్రీకరణ జరుగుతుంది. విద్యార్థులకు ఉపకారవేతనాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంతో పాటు వారికి ఆధార్‌కార్డుతో ముడిపెట్టడం వల్ల విద్యార్థులంతా ఒకే పార్టీ ఆధార్ కేంద్రానికి వచ్చారు. దీంతో పాటు కేంద్రప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలలో ఆధార్ తప్పనిసరి అని ప్రకటించడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అభయహస్తం మహిళలు సైతం ఆధార్‌కార్డు కోసం వస్తున్నారు. విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్యకార్డు కోసం, ఫించన్‌కోసం ఆధార్‌కార్డు తప్పని సరి అనడంతో గుండెపోటు ఉన్న ఉద్యోగులు సైతం ఆధార్‌కేంద్రం వద్ద పడిగాపులు గాస్తున్నారు. ప్రజల అవసరాలను బట్టి అన్ని మండల కేంద్రాలలో ఆధార్ కేంద్రాలను తెరవడంతో పాటు మెదక్ డివిజన్ కేంద్రంలో కంప్యూటర్ల సంఖ్య పెంచి ప్రజల అవస్థలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధార్ కార్డుల దరఖాస్తు ఫారాలు సైతం లేవని, సోమవారం వస్తాయని అనడంతో జనం నినాదాలు చేశారు. పరిస్థితిని గమనించిన మెదక్ ఎస్సై తన సిబ్బందిని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉంచారు.