ఆధార్‌ అనుసంధానం డిసెంబర్‌31 వరకు పొడిగింపు

సుప్రీంకు కేంద్రం వివరణ

న్యూఢిల్లీ,ఆగస్ట్‌30  : పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కార్డును తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు నవంబర్‌లో విచారణ చేపట్టనుంది. ఆధార్‌పై వచ్చిన పిటిషన్లు నవంబర్‌ మొదటి వారంలో విచారిస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో సంక్షేమ పథకాలకు ఆధార్‌ను జతచేసేందుకు గడువును కేంద్రం పొడగించింది. డిసెంబర్‌ 31 వరకూ ఈ గడువును పొడగిస్తున్నట్లు అటార్నీ జనరల్‌ కోర్టుకు తెలిపారు. దీంతో ప్రజలకు మరో నాలుగు నెలల వెసలుబాటు

కలిగింది. వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ అనుసంధానం గడువును పొడిగించాలని ఆదేశించింది. ఆధార్‌లింక్‌పై బుధవారం విచారించిన సుప్రీం ఈ గడువును మరో మూడు నెలల పాటు పొడిగించాలని ఆదేశించింది. ఈ సెప్టెంబర్‌ 30తో ముగియనున్న గడువును డిసెంబరు31వరకు పొడిగించాలని ధర్మాసనం ప్రకటించింది. తదుపరి విచారణను నవంబరుకు వాయిదా వేసింది. ఈ విషయంపై వాదనలు వినడానికి అంత తొందర ఏవిూలేదని ధర్మాసనం పేర్కొంది. వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్‌ లింకింగ్‌ను గడువును పొడిగించాలని సుప్రీం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్‌ మరో మూడు నెలలపాటు ఈ గడువును పొడిగించనున్నామని కోర్టుకు చెప్పారు. చీఫ్‌ జస్టిస్‌ దీపాక్‌ మిశ్రా బెంచ్‌, జస్టిస్‌ అమితావ రాయ్‌, జస్టిస్‌ ఎ.ఎం. ఖాన్విల్కర్‌ లతో కూడిన ధర్మాసనం ఆధార్‌ వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘింఘనపై తదుపరి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. నవంబర్‌ మొదటి వారంలో తదుపరి విచారణ ఉంటుందని ఖాన్విల్కర్‌ చెప్పారు.

కాగా వివిధ సామాజిక సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం ఆధార్‌ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ మూడు వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. వివిధ పిటిషనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ బెంచ్‌ ముందు తమ వాదనలు వినిపించారు .కేంద్రం ప్రభుత్వం గతంలోజారీ చేసిన ఆదేశాల ప్రకారం సంక్షేమ పథకాలకు ఆధార్‌ లింకింగ్‌ గడువు సెప్టెంబర్‌ 30తో ముగియనుంది. అయితే తాజా నిర్ణయం ప్రకారం ఈ గడువు డిసెంబర్‌ 31వరకు పొడిగించినట్టయింది. ఇప్పటికే అన్నింటికి ఆధార్‌ అనుసంధనాం తప్పనిసరి చేశారు. ఇటీవల పలు ప్రభుత్వ పథకాలకు కేంద్రం ఆధార్‌ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆధార్‌ తప్పనిసరి చేయడం ద్వారా తమ వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని పిటిషన్‌దారులు పేర్కొన్నారు. దీంతో ఆధార్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై విచారణ చేపట్టిన సదరు ధర్మాసనం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ ఇటీవల తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఈ తీర్పును పరిగణనలోకి తీసుకుని ఆధార్‌పై విచారణ చేపట్టనున్నారు.