ఆధార్‌ సేవలు మా వల్ల కాదు  

– బ్యాంకు ఉద్యోగులు
ముంబై,నవంబర్‌4(జ‌నంసాక్షి) : ఆధార్‌ నమోదు, నవీకరణ సేవలను అందించే సాధనాలు, నిదులు తమకు లేవని బ్యాంకు ఉద్యోగులు అంటున్నారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆదేశాల ప్రకారం కనీసం 10 శాతం బ్యాంకు శాఖలలో ఆధార్‌ సంబంధిత సేవలను అందించవలసి ఉందని, దీనికి అవసరమైన వనరులు తమ వద్ద లేవని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ డీ థామస్‌ ఫ్రాంకో మాట్లాడుతూ ఆధార్‌ కార్డ్‌లో వ్యక్తిగత గోప్యత, భద్రతాపరమైన అంశాలు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎవరైనా మోసానికి పాల్పడితే బ్యాంకు అధికారి జవాబుదారీ అని నిబంధనలు చెప్తున్నాయన్నారు. మోసపూరితమైన కార్డులను గుర్తించే పరిస్థితిలో బ్యాంకు అధికారులు లేరన్నారు. సమాచారాన్ని సేకరిస్తున్న 49 వేల ఆధార్‌ నమోదు కేంద్రాలను బ్లాక్‌ లిస్టులో పెట్టినపుడు బ్యాంకు ఉద్యోగులను ఏ విధంగా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. ఆధార్‌ సంబంధిత సేవలను అందించేందుకు లక్ష మంది ఉద్యోగులు అవసరమవుతారన్నారు.