ఆధార్ స్వచ్ఛందమే: సుప్రీం

ఆధార్ నెంబరు ఇవ్వడం స్వచ్ఛందమేనంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆదాయ పన్ను రిటర్నులు, పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేస్తూ ఆదాయపన్ను చట్టంలోని 139 ఏఏ సెక్షన్ రాజ్యాంగ బద్దతపై దాఖలైన పిటిషను విచారిస్తున్న జస్టిస్ ఎ.కె.సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్య చేసింది. పిటిషనర్ ల తరపు లాయర్ శ్యాం దివాన్ వాదనలు విన్పిస్తూ ఆధార్ చట్టంలో అంతా స్వచ్ఛందమే నని చెప్పారని…కానీ ఆదాయపు పన్ను చట్టంలో ఎందుకు విరుద్ధంగా 139 ఏఏ సెక్షన్ ను పొందుపరిచారని తెలిపారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ చట్టాన్ని ఎందుకు రూపొందిస్తున్నారో లక్ష్యాల్లో పేర్కొంటారని..అందుకు అనుగుణంగా నిబంధనలకు అర్ధం చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది.