ఆనందంగా జీవించడమే గొప్ప
హైదరాబాద్,జూన్29(జనం సాక్షి ): ప్రతి మనిషీ గొప్పవాడే. ఎవరైనా సేవలందించగలుగుతారు. దానికి ఎటువంటి విద్యార్హతలు, డబ్బు అవసరం లేదు. కారణం వెతకాల్సిన పనిలేదు. ఉండాల్సిందల్లా స్పందించే హృదయం. దాన్నిండా ప్రేమ. మనస్ఫూర్తిగా సేవలందిస్తున్నప్పుడు అది భుక్తి కోసమే అయినా తన అవసరాలు, కోరికలు స్ఫురణకు రావు. ఎదుటివారి సౌఖ్యం, భద్రత మాత్రమే దృష్టిలో ఉంటాయి. నిస్వార్థపరులు ప్రతిఫలాన్ని ఆశించి ఏ పనీ చేయరు. అటువంటివారికి దైవకృప తప్పకుండా లభిస్తుంది. ఎవరికైనా సహాయపడినప్పుడు, సేవలందించినప్పుడు హృదయం విశాలమవుతుంది. ఆత్మసంతృప్తి కలుగుతుంది. నిశ్శబ్దమంటే ప్రార్థన/ ప్రార్థనంటే నమ్మకం/ నమ్మకం అంటే ప్రేమ/ ప్రేమ ఒక సేవ/ సేవ ద్వారా లభించేది శాంతి అంటారు మదర్ థెరెసా. ఏ విధంగా సేవలందించగలను అన్న దృష్టి మనిషిలో కలిగితే, అదే అతడి జీవితంలో కేంద్ర బిందువైతే- అభివృద్ధిలో అద్భుతాలు చూడొచ్చు. ఏ పని తీసుకున్నా ఆ పని చేయడంలో ఒక్కొక్కరి దృక్పథం ఒక్కోలా ఉంటుంది. ఒకరు ఈ పనిని నరకంగా భావిస్తే, మరొకరు దానినే కర్తవ్యంగా తీసుకుంటారు. వేరొకరు దానినే భగవంతుడి ఆశీర్వాదంగా, తమకు లభించిన అదృష్టంగా భావించి చేస్తారు. ఆ దృక్పథంలోనే స్వర్గం-నరకం దాగిఉన్నాయని గ్రహించాలి. దాన్నిబట్టే జీవితంలో సుఖసంతోషాలు ఆధారపడి ఉంటాయి. కేవలం ఆర్జించగలిగే స్థితి ఉండటం, సంపదలు కలిగి ఉండటం సరిపోదు. సంతృప్తి ఉంటే ఏ సిరిసంపదలతోనూ పనిలేదు. ప్రాప్తమున్నదాంట్లో ఆనందంగా జీవించగలగడం గొప్ప విషయం!