ఆనందజీవితానికి మార్గాలు పాటించాలి
మిత్రులతో ఎటువంటి సంబంధం కొనసాగించాలో సుగ్రీవుడు, గుహుడు, విభీషణుల పాత్రలు వెల్లడిస్తాయి. స్నేహితుల మధ్య భేదభావాలు, ఎక్కువ తక్కువలు పనికిరావు. తాను మానవుడైనా, సుగ్రీవుడు వానరుడైనా ‘ఇద్దరం మిత్రులమే’ అంటాడు రామచంద్రుడు. మిత్రధర్మాన్ని కొనసాగిస్తాడు. వాలిని వధించి, సుగ్రీవుణ్ని రాజును చేస్తాడు. పడవ నడిపే గుహుణ్ని తనతో సమానంగా గౌరవిస్తాడు. దానవ వీరుడైన విభీషణుణ్ని తోటి రాజుగా ఆదరిస్తాడు.శత్రువుతోనూ ధర్మం పాటిస్తాడు రాముడు. అలసి సొలసిన రావణాసురుణ్ని- విశ్రాంతి తీసుకొని మరునాడు యుద్ధానికి రమ్మంటాడు. ఆ తరవాత, మరణించిన రావణుడి స్థాయికి తగినట్లు అంత్యక్రియలు చేయిస్తాడు. అతడి భార్య మండోదరిని ఊరడించి, మానవత్వం కనబరుస్తాడు.నేటి సమాజంలో కుటుంబసభ్యుల మధ్య బాంధవ్యాలూ ఆర్థికపరమైనవిగా మారుతున్నాయి. ప్రేమ, అనురాగం, పరస్పర గౌరవం క్షీణిస్తున్నాయి. కొడుకులు, తల్లి, తండ్రి బద్ధశత్రువులవుతున్నారు. తోటివారితో మాట్లాడే తీరికైనా లేకుండా, మనిషి ఒంటరి జీవితం గడుపుతున్నాడు. ఆకాశమార్గంలో విహరిస్తున్నా, తనకు తానే దూరమవుతున్నాడు. జీవితంలో సరస సంభాషణలు, చతురోక్తులు, మురిపించే ముచ్చట్లు కావాలి. అరమరికలు లేని రీతిలో ఆప్యాయత వెల్లివిరియాలి. కల్మషానికి, కపటానికి తావు లేని విధంగా నవ్వులు విరబూయాలి. ఇవన్నీ నిత్యం ఉంటేనే, మనిషి జీవితానికి ధన్యత చేకూరుతుంది!