ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను జమ చేయండి
ఏలూరు, జూలై 29 : ఆదాయపు పన్నుపై సరైన అవగాహనతో వ్యవహరించి ఎప్పటికప్పుడు ఆదాయపు పన్నును ఆన్‌లైన్‌లోనే జమచేసే విధానాన్ని తెలుసుకోవాలని నేషనల్ సెక్యూరిటీ డవలప్‌మెంట్ లిమిటెడ్ సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ కుందూరు నరసింహారెడ్డి చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన ట్రజరీ అధికారుల సమావేశంలో ఇన్‌కంటాక్స్ 24జి, 24 క్యూ, ఇతర అంశాలపై అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి నెల డ్రాయింగ్ ఆఫీసర్ నుంచి మినహాయించిన ఆదాయపు పనున్న ట్రజరీ అధికారులు ప్రతి నెలా 24జికు ఫైల్ చేసి దానికి సంబంధించిన బిన్ నెంబరు డ్రాయింగ్ ఆఫీసర్‌కు ఇవ్వవలసి ఉంటుందని నరసింహారెడ్డి చెప్పారు. ఆదాయపు పన్ను శాఖకు ప్రతి నెలా సంబంధిత వివరాలు ఇవ్వకపోతే అనేక ఇబ్బందులకు గురి అవుతారని కావున ఈ విషయంపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. జిల్లా ట్రజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మోహనరావు మాట్లాడుతూ, ఆన్‌లైన్ ద్వారా ఇప్పటికే వివిధ పద్దులపై సరైన అవగాహన పెంపొందించడం జరిగిందని భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేసేలా ఈ సదస్సు ఉపయోగపడుతుందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ట్రజరీ డిడి జి.లలిత, కృష్ణాజిల్లా ఖజానా శాఖ డిడి సురేంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ట్రజరీ ఉద్యోగుల అధ్యక్షులు కృష్ణంరాజు, కార్యదర్శి గణేష్‌బాబు, హరికుమార్, సత్యనారాయణ పాల్గొన్నారు.