ఆపద్బంధు సాయం కోసం అనేకుల ఎదురుచూపు
సకాలంలో అందక కుటుంబాల్లో ఆందోళన
హైదరాబాద్,జూలై23(జనంసాక్షి): ప్రమాదవశాత్తు కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆపద్బంధు పథకం జిల్లాలోని బాధిత కుటుంబాలను ఆదుకోవడం లేదు. ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియా కోసం పలు కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. తమకు ఎక్స్‌గ్రేషియో వస్తున్నదని ఆశించిన బాధిత కుటుంబాలకు నిరాశే ఎదురయ్యింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోని బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను మంజూరు చేసిన ప్రభుత్వం జిల్లాలోని బాధిత కుటుంబాలకు మంజూరు చేయక పోవడం గమనార్హం. 2011-12 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు పెండింగులో ఉన్న బాధిత కుటుంబాలకు 50 వేల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని 39 కుటుంబాలకు 19 లక్షల 50 వేల రూపాయలు, హైదరాబాద్ జిల్లాలోని 52 కుటుంబాలకు 26 లక్షలు, జగిత్యాల జిల్లాలోని 20 కుటుంబాలకు 10 లక్షలు, కామారెడ్డి జిల్లాలోని 29 కుటుంబాలకు 14 లక్షల 50 వేలు, కరీంనగర్ జిల్లాలోని 32 కుటుంబాలకు 16 లక్షలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని 3 కుటుంబాలకు లక్షా 50 వేలు, నిర్మల్ జిల్లాలోని 16 కుటుంబాలకు 8 లక్షలు, నిజామాబాద్ జిల్లాలోని 106 కుటుంబాలకు 53 లక్షలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 10 కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, వనపర్తి జిల్లాలోని రెండు కుటుంబాలకు ఒక లక్ష, వరంగల్ రూరల్ జిల్లాలోని 4 కుటుంబాలకు 2 లక్షలు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 19 కుటుంబాలకు 9 లక్షల 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియో సొమ్మును ప్రభుత్వం విడుదల చేసింది. పదిహేను సంవత్సరాల నుంచి ఆపద్బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా టెండర్లు నిర్వహించి ఏదేని బీమా సంస్థకు అప్పగిస్తారు. పథకాన్ని మాత్రం రెవెన్యూ శాఖ అధికారులే అమలు చేస్తారు. మార్గదర్శకాల ప్రకారం ఉన్న కుటుంబాలకే ఎక్స్‌గ్రే షియా మంజూరుకు సిఫారసు చేస్తారు. బీమా కంపె నీ ప్రతినిధులు కూడా క్షేత్రస్థాయిలో అన్ని వివరాలు తెప్పించుకుని సరి చూసిన తర్వాతనే నిధులను విడుదల చేస్తారు. వీరి కుటుంబాలకు 50 వేల రూపాయల చొప్పున 35 లక్షల 50 వేల ఎక్స్‌గ్రేషియో మంజూరు చేయాలంటూ ప్రభుత్వానికి జిల్లా అధికారులు లేఖ రాశారు. అయినా కూడా నిధులు మంజూరు కావడం లేదు.