ఆపరేషన్లు బంద్

 

ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు నిలిపివేత

అత్యవసరం అయితేనే ఆపరేషన్లు జరపాలి

వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎస్ భేటీ

హైదరాబాద్, మార్చి 17(జనంసాక్షి):బోధన, స్పెషాలిటీ ఆస్పత్రుల్లో నిర్ణీత శస్త్రచికిత్సలు నిలిపివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నిర్ణీత శస్త్రచికిత్సలు నిలిపివేతకు నిర్ణయించారు. అత్యవసర శస్త్రచికిత్సలు, ఓపీ, వైద్య సేవలు యథావిధిగా కొనసాగించాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీఎస్ నిర్వహించిన సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ఆస్పత్రులకు వర్తిస్తుందని తెలిపారు. మరోవైపు విదేశాల నుంచి వచ్చే వారిని ఎప్పటికప్పుడు ఎయిర్ పోర్టుల్లోనే స్క్రీనింగ్ చేస్తున్నారు. ఏ మాత్రం కరోనా లక్షణాలున్నా.. శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేస్తున్నారు.

ఇలా టెస్టులు చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 52 టెస్టింగ్ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది . ఇవి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పర్యవేక్షణలో నడుస్తున్నాయి. వీటన్నింటికీ చీఫ్ ల్యాబొరేటరీగా పుణెళిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ వైరాలజీ పనిచేస్తోంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండడంతో మరో పది టెస్టింగ్ సెంటర్లను పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. వీటికి అదనంగా మరో 9 చోట్ల త్వరలోనే ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఈ ల్యాబ్స్ తెలంగాణలో రెండు ఉన్నాయి. హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీల్లోని వైరాలజీ ల్యాబ్స్ లో కరోనా టెస్టులు చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో నాలుగు చోట్ల ఈ ల్యాబ్ అందుబాటులో ఉన్నాయి. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ దాదాపు 150 దేశాలకు వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షా 70 వేల మందికి ఈ వైరస్ సోకింది. దాదాపు 6 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా చైనాలో 81 వేల మంది వైరస్ బారినపడగా.. 3,217 మంది మరణించారు. ఆ తర్వాత ఇటలీలో 25 వేల మందికి వైరస్ సోకింది. ఆ దేశంలో 1809 మంది మృతి చెందారు. అమెరికాలో 3600 మంది కరోనా బారినపడగా.. 69 మంది మరణించారు. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 126కి చేరినట్లు మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో ముగ్గురు మరణించగా.. 13 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. మన దేశంలో రోజూ కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. అయితే పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ప్రస్తుతం కొంత కంట్రో లోనే ఉంది. ఇకపై కూడా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇదిలావుంటే ఫిలిప్పీన్స్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థులు, ఉత్తర భారతదేశానికి చెందిన విద్యార్థులు సుమారు 200 మంది మలేసియాలో చిక్కుకుపోయారు. కరోనా వైరస్ ప్రభావంతో ఫిలిప్పీన్స్ నుంచి భారత్కు వీరు తిరుగు ప్రయాణం కాగా హఠాత్తుగా మలేసియాలో విమానాలను రద్దు చేశారు. దీంతో అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులంతా భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని స్వదేశానికి వచ్చేలా చేయాలని కోరుతున్నారు. మలేసియాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల్లో కొందరు మాట్లాడుతూ మళ్లీ విమానాలు ఎప్పటి నుంచి తిరుగుతాయో మలేసియా ప్రభుత్వం కానీ, అక్కడి విమానాశ్రయ అధికారులు కానీ స్పష్టత ఇవ్వడం లేదని చెప్పారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను స్వస్థలాలకు చేర్చాలని కోరారు.

తాజావార్తలు