ఆపరేషన్‌ ఉత్తరకొరియా

– యూఎస్‌, దక్షిణకొరియా భారీ వైమానిక విన్యాసాలు

సియోల్‌, డిసెంబర్‌4(జ‌నంసాక్షి) : అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణి ప్రయోగంతో ప్రపంచదేశాలను మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ఉత్తరకొరియా చర్యకు దీటుగా బదులిచ్చేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. దక్షిణకొరియాతో కలిసి సోమవారం భారీ వైమానిక విన్యాసాలు చేపట్టింది. గతంలో చేపట్టిన వైమానిక విన్యాసాల కంటే ఇది చాలాపెద్దది కావడం గమనార్హం. ఉత్తరకొరియా రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందనగా ‘ఆపరేషన్‌ ఉత్తరకొరియా’ పేరుతో ఈ డ్రిల్‌ చేపట్టినట్లు తెలుస్తోంది.

ఐదు రోజుల పాటు జరిగే ఈ డ్రిల్‌లో 230 ఎయిర్‌క్రాఫ్ట్‌లు విన్యాసాలు చేయనున్నాయి. వీటిలో ఎఫ్‌-22 రాప్టర్‌ స్టీల్త్‌ యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. ఇరు దేశాలకు చెందిన వేల సంఖ్యలో వైమానిక సిబ్బంది కూడా డ్రిల్‌లో పాల్గొననున్నట్లు దక్షిణకొరియా వైమానికశాఖ తెలిపింది. రెండు నెలల పాటు నిశ్శబ్దంగా ఉన్న ఉత్తరకొరియా గతవారం శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన విషయం తెలిసిందే. హ్వాసంగ్‌-15 పేరుతో విజయవంతంగా ప్రయోగించిన ఈ క్షిపణి వాషింగ్టన్‌ను చేరుకోగలదని ఆ దేశం ప్రకటించింది. ఈ ప్రయోగంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. క్షిపణి ప్రయోగం నేపథ్యంలో అమెరికా, ఉత్తరకొరియా దేశాలు మరోసారి మాటల యుద్ధానికి దిగాయి. ఇలాంటి పరీక్షలు ఆపకపోతే యుద్ధానికి దిగాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించగా.. తమ దేశాన్ని రెచ్చగొడితే అణుయుద్ధానికి వెనుకాడబోమని ఉత్తరకొరియా కూడా దీటుగా బదులిచ్చింది. ఈ క్రమంలో అమెరికా, దక్షిణకొరియా భారీ డ్రిల్‌ సర్వత్రా ఉత్కంఠకు గురిచేస్తోంది.