ఆపరేషన్ మయన్మార్ సక్సెస్
న్యూఢిల్లీ,జూన్11(జనంసాక్షి): ఉగ్రవాదులను తుదముట్టించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ మయన్మార్ విజయవంతమైంది. దాదాపు వంద మంది తీవ్రవాదులు ఈ ఆపరేషన్‌లో మరణించారు. కార్గిల్ యుద్దం తరవాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఇప్పుడు పెద్దగా ప్రాచుర్యంలోకి రాకున్నా ఉగ్రవాదులను ఎదిరించడానికి ఎలాంటి వెనకడుగు వేయబోమని కేంద్రం స్పస్టం చేసింది. ఈశాన్య భారతదేశంలో దాడులకు తెగబడుతూ మయన్మార్ భూభాగంలో దాక్కున్న ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఉగ్రవాద గ్రూపులన్నింటికీ గట్టి హెచ్చరికలాంటిదే. సరిహద్దుల ఆవల దాక్కున్నా ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఈ చర్య ద్వారా భారత్ స్పష్టంచేసింది. ఇదో రకంగా పాక్ ఉగ్రవాదులకు హెచ్చరికలాంటిదనే చెప్పాలి. తరచూ దాడులు చేస్తూ ఇక్కడ ప్రజలను, భద్రతాదళాలను దొంగ దెబ్బతీస్తున్న పాక్ ఉగ్రవాదులు ఇక జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరిక లాంటిది. మంగళవారం తెల్లవారుజామున పాత బర్మా లేదా నేటి మయన్మార్ భూభాగంలోని రెండు ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం జరిపిన దాడుల్లో దాదాపు వంద మంది ఉగ్రవాదులు మరణించారని సమాచారం. లాడెన్ కోసం అమెరికా చేసిన ఆపరేషన్ తరహాలోనే భారత్ దాడి చేయడం విశేషం. అయితే మయన్మార్‌కు కూడా తెలియకుండా ఆపరేషన్ చేసిన మన సైన్యం ధీరాదత్తత అభినందనీయం. మణిపూర్‌లో నాలుగో తేదీన సైనిక కాన్వాయ్‌పై మెరుపుదాడి చేసి 18 మంది సైనికులను ఉగ్రవాదులు చంపేయటాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, అదే రోజు ప్రత్యేక ఆపరేషన్‌కు రూపకల్పన చేసింది. సైన్యం, వైమానికదళం పక్కా ప్రణాళికతో పని పూర్తిచేశాయి. జాతీయ భద్రతాసలహాదారు అజిత్‌దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ సుహాగ్‌లో విదేశీ పర్యటనలను రద్దుచేసుకొని మయన్మార్‌లోనే ఉండి ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. మయన్మార్‌లో భారత్ సైనిక చర్య ఓ కఠిన సందేశంగా భావించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన గమనార్హం. భారత సైన్యం, వైమానికదళం సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఆర్మీ 21వ స్పెషల్ ఫోర్సెస్ కమెండోలు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కప్లాంగ్ వర్గం (ఎన్‌ఎస్‌సీఎన్‌కే), కంగ్లీ యవోల్ కన్నలుప్ (కేవైకేఎల్) ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ నెల నాలుగోతేదీన మణిపూర్‌లోని చందల్ జిల్లాలో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడిచేసి 18 మంది జవాన్లను చంపివేసినందుకు ప్రతిస్పందనగా సైన్యం ఈ ఆపరేషన్ చేపట్టింది. మొట్టమొదటిసారి విదేశీ భూభాగంలో ఈ సైనిక చర్య చేపట్టడం సాహసోపేత నిర్ణయంగా భావించాలి. ఇది పాక్, బంగ్లాల్లో నక్కి దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు గుణపాఠం కానుందనడంలో సందేహం లేదు. ఉగ్రవాదంపై భారత్ ఏ మాత్రం సహనం వహించదని గడ్కరీ స్పష్టంచేశారు. సైనిక చర్యకు అసోం సీఎం తరుణ్ గొగోయ్ మద్దతు తెలిపారు. మయన్మార్- భారత్ సరిహద్దుకు కొన్ని కిలోవిూటర్ల దూరంలో మయన్మార్ భూభాగంలోని దట్టమైన అడవులు, కొండల మధ్య వేర్వేరుచోట్ల ఎన్‌ఎస్‌సీఎన్ కే, కేవైకేఎల్ ఉగ్రవాద శిబిరాలను భారత నిఘా వర్గాలు ముందుగానే గుర్తించాయి. మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో వైమానిక దళ ఎంఐ-17 హెలికాప్టర్లు 70 మంది సైనిక కమెండోలను సరిహద్దుల్లోకి చేర్చాయి. అక్కడి నుంచి కాలినడకన ఉగ్రవాద శిబిరాల వద్దకు చేరుకున్న కమెండోలు 3.30గంటల సమయంలో ఒక్కసారిగా దాడిచేశారు. అరగంటలోనే శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసి తిరిగి భారత భూభాగంలోకి చేరుకున్నారు. ఈ ఆపరేషన్‌ను భారత్ ధృవీకరించింది.