ఆప్‌ ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేదీ లేదు

 

రాజకీయంగా ఉపయోగించుకోనున్న బిజెపి

న్యూఢిల్లీ,జనవరి22(జ‌నంసాక్షి): ఇసి సిఫారసు మేరకు 20 మంది ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి కోవింద్‌ అనర్హత వేటు వేసినందున తక్షణం ఆప్‌ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేవిూ లేదు. అయితే రాజకయీంగా ఇది సంచలనానికి కారణమయ్యింది. రాష్ట్రపతి నిర్ణయంతో ఢిల్లీ అసెంబ్లీలో 67మంది ఎమ్మెల్యేలున్న ఆప్‌ బలం 47సభ్యులకు పడిపోవచ్చు. అయినప్పటికీ, ప్రభుత్వం మనుగడకు అవసరమైనదానికంటే పదిసీట్లు ఎక్కువే ఉన్నాయి కనుక ఆప్‌కు తక్షణ ప్రమాదమేవిూ లేకపోవచ్చు. అయితే లాభదాయక పదవుల వ్యవహారం కేజీవ్రాల్‌ పరువుతీసిన మాట మాత్రం వాస్తవం. అయితే ఈ వ్యవహారంతో ఆప్‌ను దెబ్బతీసేందుకు బిజెపి సిద్దంగా ఉంది. అందుకే కేజీవ్రాల్‌కు పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదనీ, తక్షణం గద్దెదిగాలని బీజేపీ అంటున్నది. పలురాష్టాల్ల్రో ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న తరువాత కేజీవ్రాల్‌ బీజేపీ విూద నోరుచేసుకోవడం బాగా తగ్గించేశారు. ఆయన కయ్యానికి కాలుదువ్వడం మానేసిన తరవత ఢిల్లీ ఉప ఎన్నికలో తన సత్తా చాటి ఓ స్థానాన్ని గెలిచారు. ఇప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయం రెండు పార్టీల మధ్యా తిరిగి నిప్పు రాజేసింది. ఇదంతా కేంద్రం కనుసన్నల్లో జరిగిందన్నది ఆప్‌ ప్రధాన ఆరోపణగా ఉంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్యోతి పదవీ విరమణకు రెండు రోజుల ముందే ఈనిర్ణయం వెలువడటం వెనుక అధికారపార్టీ ఒత్తిడి పనిచేసిందని ఆప్‌ విరుచుకుపడుతున్నది. రాష్ట్రపతి ఎప్పుడో అభిప్రాయాన్ని అడిగితే, ఈ హడావుడి సమాధానంలో ఆంతర్యమేమిటని ఆప్‌ ప్రశ్నిస్తున్నది. ఎన్నికల సంఘం ఎన్నడూ లేనంతంగా పతనమైందని ఆప్‌ నేతలు విమర్శించారు. ఇటువంటి విమర్శలు ఎప్పుడూ ఉండేవే కానీ, రాష్ట్రపతి కూడా ఎన్నికల సంఘం అభిప్రాయానికే ఓకే చెబుతూ 20మందిపై వేటేశారు. ఈ ఎమ్మెల్యేల స్థానాలకు మళ్ళీ ఎన్నికలు తప్పవన్నది నిజం. ఎన్నికలు జరిగితే ఆప్‌ గతంలో మాదిరిగా అధికస్థానాలు గెలుచుకోలేకపోవచ్చు. స్థానిక ఎన్నికల్లో మాదిరిగానే, ఈ గందరగోళ స్థితిలోనూ బీజేపీ ఎంతో కొంత లబ్ధిపొందే అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ 20మంది కాక, అవినీతి కేసులు ఎదుర్కొంటున్న మరో పదిమంది ఆప్‌ ఎమ్మెల్యేలవిూద కూడా అనర్హత వేటుపడుతుందని బీజేపీ ఆశగా ఎదురుచూస్తున్నది. అది సవిూపకాలంలో జరిగే అవకాశాలు లేవు. ఈ ప్రమాదకరమైన పరిస్థితి అధిగమించాలంటే, 20 స్థానాలకు జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఆప్‌కు మంచి సంఖ్య వచ్చి తీరవలసిన అవసరం ఉన్నది. కానీ, ఎన్నికల సంఘం నిర్ణయం వెంటనే హడావుడిగా జరిపిన సర్వే ఒకటి ఆప్‌కు 8స్థానాలకు మించి రావని అంటున్నది. మరో రెండు వస్తాయనుకున్నా సగం సీట్లు ఆప్‌ కోల్పోయినట్టే. ఈ సర్వే ప్రకారం అత్యంత కీలక వ్యక్తులను, ప్రాంతాలను కూడా ఆప్‌ కోల్పోవలసి వస్తున్నది. బీజేపీ ఆప్‌నుంచి 8 స్థానాలు తన్నుకుపోవచ్చునని సర్వే చెబుతున్నది. 2015లో అద్భుతమైన మెజారిటీతో గెలిచి మంచి దూకుడువిూద ఉన్న కేజీవ్రాల్‌ ఈ వివాదాస్పదమైన లాభదాయక పదవుల విషయంలో మొండితనంగా వ్యవహరించినందువల్లనే ఈ సంక్షోభానికి కారణమయ్యారు. అసెంబ్లీలో 70 సీట్లున్నందున ఢిల్లీలో ఏడుగురు మంత్రులు మాత్రమే ఉండాలి. వీరికి మంత్రిపదవులు ఇచ్చిన తరువాత, పదవుల కోసం కుమ్ములాటలు ఆరంభం కావడంతో, 21మందిని మంత్రులస్థాయి ¬దాతో పార్లమెంటరీ కార్యదర్శులుగా కేజీవ్రాల్‌ నియమించారు. 1997లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం ఆర్థిక ప్రయోజనాలున్న రెండు పదవుల్లో ఒకరు కొనసాగకూడదు కనుక ఈ నియామకాలపై వివాదం రేగింది. జీత భత్యాలు పెంచనప్పుడు ఇవి జోడుపదవులు ఎందుకవుతాయని కేజీ వాదించారు. జీతం వినా కార్లు, భవనాలు, కార్యాలయాలు ఇత్యాది సకల సౌకర్యాలూ వారికి కట్టబెడుతున్నప్పుడూ, కీలకమైన స్థానంలో ఉంటూ నిర్ణయాలను ప్రభావితం చేయగలుగుతున్నప్పుడూ అది లాభదాయకమైన పదవే అవుతుందని విపక్షాలు వాదించాయి. ఈ నిర్ణయంపై న్యాయస్థానాలు కూడా తన పక్షాన ఉండవని అనుకున్న కేజీవ్రాల్‌, ఎందుకైనా మంచిదని 1997 చట్టంనుంచి ఈ 21మంది కార్యదర్శులకు మినహాయింపు ఇస్తూ అసెంబ్లీలో సవరణ బిల్లు పెట్టి, తన బలంతో నెగ్గించుకొని రాష్ట్రపతిని ఆమోదించమన్నారు. రాష్ట్రపతి ఆ బిల్లును తిరస్కరించారు. ఇంతలో ప్రశాంత్‌ పటేల్‌ అనే ఓ యువన్యాయవాది వీరిని అనర్హులుగా ప్రకటించమని రాష్ట్రపతిని అభ్యర్థించడం, ఇదే వాదనతో కాంగ్రెస్‌ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడంతో చకచకా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ఆమోదం లేనందున ఈ నియామకపు ఉత్తర్వులు చెల్లవంటూ ఢిల్లీ హైకోర్టు గతంలోనే ప్రకటించింది. అయితే కేంద్రం అన్ని విధాలా మనల్ని వేధించాలని చూస్తోందని,మాకు వ్యతిరేకంగా ఏవిూ లేకపోవడంతో ఈరోజు 20 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారు’ అని కేజ్రీవాల్‌ విమర్శించారు. నిజాయతీగా వెళ్లేవారికి చాలా సమస్యలు ఎదురవుతుంటాయని చెప్పారు. చివరకు నిజమే నెగ్గుతుందన్నారు. ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలేగానీ తమను నియమించినవారికి తొత్తులుగా ఉండకూడదని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ అన్నారు. మొత్తంగా న్యాయస్తానంలో ఇది ఎలాంటి ప్రభీవం చూపుతుందో అన్న చర్చ సాగుతోంది.