ఆఫ్ఘనిస్తాన్‌లో ఆత్మాహుతి దాడిలో 40 మంది మృతి

కాబూల్‌,అక్టోబర్‌26: అప్ఘానిస్తాన్‌లో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఉత్తర అఫ్గానిస్తాన్‌లో భక్తులు మసీదులో ప్రార్థనలు చేస్తుండగా శుక్రవారం ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దాదాపు 40 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆత్మాహుతి దాడిలో కనీసం 40 మంది మరణించారని అధికారులు టీవీ చానెళ్ల ప్రతినిధులతో చెప్పారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని అనుమానిస్తున్నారు. ఉగ్రవాది పోలీసు యూనిఫాంలో వచ్చి తనను పేల్చేసుకున్నా?డని చెబుతున్నారు. ఈ దాడి వెనక తాలిబాన్‌ హస్తం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. భక్తులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటు-న్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. అఫ్గానిస్తాన్‌లోని ఫార్యాబ్‌ ప్రొవిన్స్‌లో గల మయ్మానా నగరంలో ఈ దాడి జరిగింది. ఈద్‌ ఆల్‌ – ఆధా సెలవుల సందర్భంగా భక్తులు ప్రార్థనలు చేయడానికి పెద్ద యెత్తున గుమికూడారు. మృతుల్లో పోలీసులు కూడా ఉన్నారని ప్రొవిన్షియల్‌ గవర్నర్‌ అధికార ప్రతినిధి అహ్మద్‌ జావేద్‌ బైదర్‌ చెప్పారు. ఫర్యాబ్‌ పోలీసు చీఫ్‌ ఉగ్రవాదుల లక్ష్యమని తెలుస్తోంది. అయితే, ఆయన పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. పోలీసు చీఫ్‌ వాహనంలో ఎక్కుతుండా ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. భద్రతా బలగాలను లక్ష్యంగా కూడా దాడి జరిగినట్లు- తెలుస్తోంది.