‘ఆమె ఒక ఇటాలియన్’
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘ద రెడ్ శారీ’ సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ రెడ్ శారీ ఏంటనుకుంటున్నారా? కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జీవిత చరిత్రపై స్పెయిన్ రచయిత జేవియర్ మోరో రాసిన వివాదాస్పద పుస్తకం ‘ఎల్ సారీ రోజో’. అనేక అభ్యంతరాల తర్వాత.. ఇది ఎట్టకేలకు ‘ది రెడ్ శారీ’ పేరుతో భారత్లో విడుదలైంది. స్పానిష్ భాషలో తొలుత 2008లో విడుదలైన ఈ పుస్తకాన్ని అప్పటి నుంచి విడుదల చేసేందుకు రచయిత ప్రయత్నించినా.. కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం చెప్పడంతో దాన్ని ఇంగ్లీష్లో ప్రచురించేందుకు ఎవరూ సాహించలేదు. కాగా స్పానిష్ భాషలో తొలుత విడుదలైన ఈ పుస్తకంలో అభూతకల్పనలు, అర్ధ సత్యాలు, పరువునష్టం కలిగించే అంశాలు ఉన్నాయని ఆరోపిస్తూ సోనియా తరఫు న్యాయవాదులు మోరోకు 2010లో లీగల్ నోటీసులు కూడా పంపారు.
ఈ పుస్తకంపై రచయిత మోరో మాట్లాడుతూ.. సోనియాగాంధీ ఇమేజ్ను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోందన్నారు. ”భారతీయ మహిళల్లో ఆమె చాలా బిజీ. ఆమె భారతీయురాలు అయినా… వాస్తవానికి సోనియా ఇండియన్ కాదు. భారతీయ పౌరసత్వం కలిగి ఉన్నానని నిరూపించుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్కు సోనియా తన ఫ్యామిలీతో వెళ్తే అక్కడ అన్నీ ఇటాలియన్ ఫుడ్నే ఇష్టపడతారు. అలాంటి ఆమె ఇండియాను పాలిస్తారా? ఆమె ఒక ఇటాలియన్” అన్నారు. ఈ పుస్తకంపై మోరో శనివారం సాయంత్రం అయిదు గంటలకు ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు.
సోనియా బాల్యం, రాజీవ్‌గాంధీతో ప్రేమాయణం, ఇందిరాగాంధీ కోడలు కావడం, ప్రధాని అవకాశాన్ని తిరస్కరించడం వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. ఇటలీకి చెందిన సోనియా.. రాజీవ్‌గాంధీని పెళ్లి చేసుకున్నాక జరిగిన పలు సంఘటనలు, సోనియా అత్త, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని అంగరక్షకులే కాల్చిచంపడంతో ఆమె భయాందోళనకు గురైనట్లు, ప్రధాని బాధ్యతలు స్వీకరించవద్దని రాజీవ్‌ను బతిమిలాడినట్లు ఆ పుస్తకంలో రాశారు. సోనియా ఆప్తమిత్రులు, సహచరుల నుంచి సేకరించిన సమాచారాన్ని మోరో ఈ పుస్తకంలో పొందుపరిచారు.