ఆమె లేకుండానే సెంచరీ బాదేసిన రోహిత్
న్యూఢిల్లీ,జూలై10(జనం సాక్షి ): టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ సిరీస్‌లో ఇరగదీసాడు. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20లో వీర బాదుడుతో అజేయ సెంచరీ చేసి జట్టుకు అపూర్వ విజయాన్నిఅందించాడు. సిరీస్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ కూడా అందుకున్నాడు. క్రీజులోకి వచ్చింది మొదలు హిట్టింగే పనిగా పెట్టుకునే రోహిత్‌ను అభిమానులు ముద్దుగా ‘హిట్ మ్యాన్’ అని పిలుచుకుంటూ ఉంటారు. మూడో మ్యాచ్‌లో సెంచరీ చేసిన అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. టీ20ల్లో తాను సాధించిన మూడు సెంచరీలు తనకు ఎంతో ప్రత్యేకమైనవని చెప్పాడు. ఇందులో ఏది గొప్పది అనే విషయాన్ని తాను చెప్పలేనని, అవన్నీ దేనికవే ప్రత్యేకమని పేర్కొన్నాడు. భవిష్యత్తులో మరిన్ని శతకాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. తన భార్య రితిక స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్నప్పుడే తాను సెంచరీ సాధిస్తానని చాలామంది అనుకుంటూ ఉంటారని, కానీ అందులో నిజం లేదన్నాడు. మొన్న సెంచరీ చేసినప్పుడు ఆమె తన ఎదురుగా లేదని అన్నాడు. తను ఇక్కడ లేదని, త్వరలోనే వస్తుందని తెలిపాడు.