ఆమ్‌చూర్ రైతులనూ వదలని దళారులు
నిజామాబాద్,మే11(జనం సాక్షి ): నిజామాబాద్ యార్డుకు ఇప్పుడిప్పుడే ఆమ్‌చూర్ పంట తరలివస్తోంది. అయితే ఇక్కడ కొనుగోళ్లు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఈపంటకు ఎక్కడా పెద్దగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో దాదాపు పది జిల్లాల నుంచి రైతులు ఇక్కడకు పంట తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఈసారి రైతులు పెద్దమొత్తంలో మామిడికాయలను ఆమ్‌చూర్‌గా మార్చేశారు. చాలాచోట్ల గుత్తేదారులు పంటను కౌలుకు తీసుకుని మార్కెట్‌కు తెచ్చారు. ఐతే చివరి సంవత్సరం వచ్చిన ధరలో ఈసారి సగం కూడా వ్యాపారులు ఇవ్వకపోవడంతో రైతులు నిట్టూరుస్తు న్నారు.రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆమ్‌చూర్‌కు నిజామాబాద్ కేంద్రంగా ఉంది. దూరప్రాంతాల నుంచి ఎంతో ఆశతో పంటను అమ్ముకునేందుకు ఇక్కడికి వచ్చిన రైతులను వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నారు. పర్యవేక్షణ లోపం, అధికారుల అలసత్వంతో వ్యాపారులు కూటమి కట్టి నిండా ముంచుతున్నారు. కడ్తా పేరుతో కూడా దోపిడీ చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు అప్పటికప్పుడు చెల్లింపులు చేస్తేనే ఇంటికి వెళ్లే పరిస్థితి. రైతుల బలహీనతను సాకుగా భావించి పలికిన ధరకు నూటికి రూ. 8-10 చొప్పున తగ్గించి ఇస్తున్నారు.ఇందులో నుంచి వ్యాపారులు కొంతమంది మార్కెట్ అధికారులకు కూడా చేతులు తడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి.