ఆరాచకశక్తుల్ని అడుగుపెట్టనీయొద్దు
– హైదరాబాద్ శాంతినగరం
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్,నవంబరు 27(జనంసాక్షి): మతం పేరుతో ఆరాచకాలను సృష్టిస్తున్న పార్టీలను అధికారంలోకి రానీయొద్దని కేటీఆర్ అన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని స్వార్థ రాజకీయాలు చేస్తూ నాలుగు ఓట్లు రాల్చుకోవాని భాజపా ప్రయత్నిస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వేర్వేరుగా నిర్వహించిన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనం, ఆర్యవైశ్య ఆత్మీయ అభినందన సభలో కేటీఆర్ మాట్లాడారు. జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని చెప్పారని.. ఇప్పటివరకు ఎవరి ఖాతాల్లోనైనా పడ్డాయా అని నిలదీశారు. ఉద్దీపన ప్యాకేజీ కింద రూ.20 లక్షల కోట్లు ఇచ్చామంటున్నారని.. మరి ఆ ప్యాకేజీ ద్వారా ఎవరికైనా ఒక్క రూపాయి లబ్ధి జరిగిందా అని ప్రశ్నించారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తామని ఊదరగొట్టారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా భాజపా, ఎంఐఎం నేతల వ్యవహార శైలిపై కేటీఆర్ మండిపడ్డారు. ఒకరు సర్జికల్ స్ట్రైక్స్ అంటే.. మరొక్కరు సమాధులు కూలుస్తామంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు రావడం కాదు.. ఉన్న ఉద్యోగాలు పోయాయని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలైన ఎయిర్ ఇండియా, ఎల్‌ఐసీని అమ్మేశారని అన్నారు. మత విద్వేషాలు సృష్టించి పిల్లల భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఎవరి నాయకత్వం ఉంటే బాగుంటుందో ప్రజలే ఆలోచించాలన్నారు. హైదరాబాద్‌కు తెరాస ఎంతో చేసిందని.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని కేటీఆర్ వివరించారు. కర్ఫ్యూలు, కల్లోలాలు లేని ప్రశాంత హైదరాబాద్‌ను సాధించుకోవాలని అన్నారు. పనిమంతులను ఓటు ద్వారా ఆశీర్వదించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని ఎవరు ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారో ఆలోచించాలని కోరారు. ఆర్యవైశ్యులు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్నారు. అన్ని వర్గాలతో పాటు ఆర్యవైశ్యులను కూడా ఆదరించినట్లు కేటీఆర్ వెల్లడించారు. తెరాసలో వారికి సముచిత గౌరవం కల్పించినట్లు చెప్పారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని.. ఆయన నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని కేటీఆర్ హావిూ ఇచ్చారు. ఇతరత్రా ఎలాంటి సమస్యలున్నా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించారు.
గ్రేటర్ ఎన్నికల్లో భావోద్వేగాలను రెచ్చగొడితే వాటిని నమ్మేందుకు హైదరాబాద్‌లో ఎవరూ సిద్ధంగా లేరని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చిన ఆరేళ్లలో హైదరాబాద్‌కు ఏం చేశారని ఆ పార్టీ నేతలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకే భావోద్వేగాలను బూచిగా చూపి లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఆరేళ్లుగా శాంతిభద్రతల విషయంలో రాజీపడకుండా చర్యలు తీసుకున్నామని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. పరిస్థితి చేయిదాటేలా ఎవరైనా వ్యవహరిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని.. ఆఖరికి తమ పార్టీ నేతలైనా వదలబోమని హెచ్చరించారు. పాతబస్తీలో కేవలం ముస్లింలే ఉన్నారా? హిందువులు లేరా? అని ప్రశ్నించారు. పాతబస్తీపై అంత ద్వేషం ఎందుకని భాజపా నేతలను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
పాతబస్తీలో 10-12 సీట్లు గెలుస్తాం
2016 గ్రేటర్ ఎన్నికల్లో పాతబస్తీలోని పలుస్థానాల్లో ఎంఐఎంను ఓడించామని కేటీఆర్ గుర్తు చేశారు. అక్బర్‌బాగ్, లంగర్‌హౌస్, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లో విజయం సాధించామన్నారు. ఈసారి ఆ ప్రాంతంలో 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీతో ఎలాంటి అవగాహన లేదని.. అంశాలవారీగా కొన్ని విషయాల్లో వాళ్లు తమకు మద్దతిస్తున్న మాట వాస్తమేనన్నారు. అయితే గతంలో తాము కూడా ఇలాగే పార్లమెంట్‌లో మద్దతిచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో తెరాస తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. ఏ పార్టీ అవసరమూ లేకుండా తెరాస మహిళా కార్పొరేటర్లే మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. మేయర్ ఎన్నికలో ఎక్స్‌అఫీషియో ఓట్ల అవసరమే తమకు రాదన్నారు.