ఆరునూరైనా ప్రాజెక్టులు నిర్మిస్తాం
– 1300 టీఎంసీల నీటిని వాడుకుంటాం
– కాళేశ్వరం ఉత్తరతెలంగాణ వరప్రదాయిని
– కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులకు భూమిపూజ చేసిన సీఎం కేసీఆర్
కరీంనగర్,మే2(జనంసాక్షి):గోదావరి జలాల వినయోగంలో గొప్పముందడుగు పడింది. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలలను వినయోగంలోకి తీసుకుని రావాలన్న సంకల్పానికి బీజం పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సిఎం కెసిఆర్ శకుస్థాపన చేశారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణాల మధ్య శంఉస్థాపన చేఇన సిఎం కెసిఆర్ ఇచ్చిన హావిూ మేరకు అడుగులు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా మారనుందని ఈ సందర్భంగా ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు భూమి పూజ చేశారు. భూమి పూజ అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అని అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇవాళ భూమిపూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. మేడిగడ్డ ద్వారా కరీంనగర్ జిల్లాలో రెండు పంటలు పండించుకోవచ్చు అని చెప్పారు.15 నెలల వ్యవధిలో పంప్ హౌజ్‌ల నిర్మాణం పూర్తి అవుతుందని, బ్యారేజీ పూర్తి కాకముందే పంప్ హౌజ్‌ల ద్వారా నీరు వాడుకోవచ్చు అని తెలిపారు. పత్తిపాక వద్ద రిజర్వాయర్ నిర్మించడం ద్వారా కరీంనగర్ జిల్లాకు మేలు జరుగుతుందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ద్వారా 54 కిలోవిూటర్ల మేర నీరు ఉంటుందన్నారు. కరీంనగర్‌లో ఇంచు భూమి కూడా మిగలకుండా నీళ్లు పారుతాయని పేర్కొన్నారు. మంథని అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కాళేశ్వరం అద్భుతమైన పర్యాటక కేంద్రం కాబోతుందన్నారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహితకు నీళ్లు తీసుకుని ఆదిలాబాద్ జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు నీరందిస్తామని పేర్కొన్నారు. చనకా-కొరటా బ్యారేజీలు నిర్మాణం పూర్తి చేసి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. పాలమూరు ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు. సమైక్య పాలకులు విడుదల చేసిన జీవోల ఆధారంగా 1300 టీఎంసీలకు లోబడే నీళ్లు వాడుకుంటామని ఉద్ఘాటించారు. పిడుగులు పడ్డా.. భూకంపాలు వచ్చినా 1300 టీఎంసీల నీటిని వాడుకుంటామని తేల్చిచెప్పారు. ఎత్తిపోతల పథకం ద్వారా రెండేళ్లలో ఎల్లంపల్లికి నీళ్లు అందుతాయి. ఎల్లంపల్లి తర్వాత మెదక్, హైదరాబాద్‌కు నీళ్లు అందుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 365 రోజులు నిజాం సాగర్‌లో నీళ్లు నింపుకునేలా ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు. నిజాంసాగర్ కింద రెండు పంటలు పండించుకోవచ్చు అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించిందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో త్వరలోనే తుది ఒప్పందం కుదుర్చుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సాగు, తాగు నీటి గోస తీర్చడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణ సకల దరిద్రాలు తొలగుతాయని అన్నారు. తెలంగాణ జిల్లాలు సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా రైతులు 2 పంటలు పండించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 3 మండలాల్లో 70 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పారు. ఎత్తిపోతల పథకం ద్వారా రెండేళ్లలో ఎల్లంపల్లికి నీళ్లు అందుతాయని.. ఎల్లంపల్లి తార్వాత మెదక్ జిల్లా, హైదరాబాద్‌కు నీళ్లు వస్తాయని తెలిపారు. 15 నెలల వ్యవధిలో పంప్‌హౌజ్‌ల నిర్మాణం పూర్తి అవుతుందని వివరించారు. కాళేశ్వరం నుంచి
మేడిగడ్డకు హెలికాప్టర్‌లో చేరుకున్న సీఎంకు నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ దంపతులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా దానికి ఓ జలవిధానం లేకుండా పోయిందని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. తెలంగాణలో ఓ విధానం, ఎపిలో మరో విధానం, మహారాష్ట్రలో ఇంకో విధానం అవలంబించడం దారుణమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఏనాడు గోదావరి జలాలను వినియోగించుకోవాలన్న ఆలోచన చేయలేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఎందుకు ధర్నా చేస్తున్నారో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని నాలుకన్నాయో అర్థం కావడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మాట మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కొంతమంది నేతలు పిచ్చి మాటలు మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు.ప్రాజెక్టులపై విపక్ష నేతలు చేస్తున్న విమర్శలపై కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఒక పాలసీ అంటూ లేదని విమర్శించారు. ఏపీలోని కొన్ని రాజకీయపక్షాలు చిల్లర రాజకీయలు చేస్తున్నాయని మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు 1300 టీఎంసీలు కేటాయించారని.. ఆ మొత్తం వాడుకునేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కేసీఆర్ అన్నారు.
ప్రాణహిత-చేవెళ్ల నమూనా మార్పుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా ఇది రూపాంతరం చెందింది.ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 7 జిల్లాల్లో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీలు అందుబాటులోకి రానున్నాయి. పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీల నీరు సమకూరనుంది. రూ. 84 వేల కోట్ల వ్యయంతో మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. అంతకుముందు కాళేశ్వరంలోని ముక్తీశ్వర ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌కు పూర్ణకుంభంతో వేదపండితులు స్వాగతం పలికారు. పార్వతీదేవికి బంగారు కిరీటం, పట్టువస్త్రాలను కేసీఆర్ దంపతులు సమర్పించారు. కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ. 25 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అనంతరం కేసీఆర్ మహదేవ్‌పూర్ మండలం కన్నెపల్లి గ్రామంలో కాళేశ్వరం పంపుహౌజ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభాపతి మధుసూదనాచారి, డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు,ఎంపిలు కెకె, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.




