ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే కెసిఆర్ లక్ష్యం
కెసిఆర్ కిట్లతో పెరిగిన ప్రసవాల సంఖ్య
మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి
హైదరాబాద్,జూలై25(జనంసాక్షి): ఆరోగ్యతెలంగాణ నిర్మించడమే సిఎం కెసిఆర్ ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. నాలుగేళ్లలో తెలంగాణలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చామని అన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందన్నారు. జిల్లా కలెక్టర్‌లు, వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఎప్పటికప్పుడు ఆస్పత్రులను సందర్శించడం వల్ల ఊహించని విధంగా మార్పులు వచ్చాయన్నారు. విద్యా, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యానిన ఇస్తున్నారని చెప్పారు. వైద్య రంగాన్ని పూర్తి స్థాయిలో పటిష్టం చేసే క్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ఫర్నీచర్, వైద్య పరికరాలను, పరీక్ష లకు సంబంధించిన యంత్రాలను అందజేసి ఉచితంగా అన్ని అందిస్తున్నా మన్నారు. ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించాలన్నదే సీఎం కేసీఆర్ ఏకైక లక్ష్యమన్నారు. ప్రధానంగా ఇటీవల ప్రవేశ పెట్టిన కెసిఆర్ కిట్ పథకం కారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను మెరుగుపర్చి ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దాలన్న సంకల్పానికి అనుగుణంగా అన్ని జిల్లాలను సందర్శించి పట్టణ, గ్రావిూణ ప్రాంత ఆస్పత్రులను పరిశీలిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయి పర్యటన ద్వారా అన్ని ఆస్ప త్రులను పూర్తి స్థాయిలో పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీస్తున్నామని అన్నారు.
అన్ని జిల్లా కేంద్రాల్లో కనీసంగా వందపడకల ఆస్పత్రులు ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని లక్ష్మారెడ్డి తెలిపారు. పాతగా ఉన్న పది జిల్లాలకు తోడు కొత్తగా 21 జిల్లాలు రావడంతో మొత్తం 31 జిల్లాల్లో
ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఇందుకు నిధులను కూడా వెచ్చించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారని అన్నారు. ఆయా జిల్లాల్లో ఆస్పత్రులను నెలకొల్పేందుకు పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. గ్రావిూణ ప్రాంతం, పట్టణ ప్రాంతంలోని ఆస్పత్రుల స్థితిగతులను ఈ క్షేత్రస్థాయి పర్యటన ద్వారా పరిశీలించి వాస్తవాలను గ్రహించాలని నిర్ణయించామని అన్నారు. గతంలో కంటే ప్రభుత్వం ద్వారా సమకూర్చిన అన్ని రకాల సౌకర్యాలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయని స్పష్టమైందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అడుగుపెట్టగానే మంచి వాతావరణం ఉండేలా అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం వల్ల గత నాలుగేళ్లలో ఊహించని మార్పులు వచ్చాయన్నారు. గతానికి భిన్నంగా ఆస్పత్రులు పనిచేస్తున్నాయన్నారు. ఇకపోతే 20 జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో ఐసీయూ విభాగాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే నాలుగు ఐసీయూలు ఏర్పాటు చేశామని, మిగతా 16 ఏర్పాటు చేసే పక్రియ వేగవంతమైందన్నారు. కిడ్నీ బాధితులకు ఆర్థిక సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 40 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. విషజ్వరాల నుంచి ఏజెన్సీ ఏరియాల్లో భయానకమైన వాతావరణం ఉండేదని, తమ ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల విషజ్వరాల సంఖ్య పూర్తిగా తగ్గిందన్నారు. కళాజాతాల ద్వారా గ్రామాల్లో ప్రత్యేక బృందాలు వెళ్లి ప్రచారం చేయడం, దోమల నివారణ కోసం ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు చేపట్టిన అనేక ముందస్తు కార్యాచరణ వల్ల సీజనల్ వ్యాధులు తగ్గాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరికైనా జ్వరాలు వస్తే ప్రభుత్వ వాహనాల్లో ఆస్పత్రులకు తరలించి చికిత్సలు చేయిస్తూ మరణాల సంఖ్యను తగ్గించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఇలాంటి మరణాల సంఖ్యపూర్తిగా తగ్గిందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరం లేని ఆపరేషన్ల సంఖ్య కూడా తగ్గిందన్నారు. లేబర్ రూల్స్‌ను పెంచి అధునాతనమైన సౌకర్యాలను కల్పించి ఆస్పత్రులను ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా తయారు చేశామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో ఉందని అన్నారు. తుప్పుపట్టిన బెడ్స్, కిటికీలకు ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి ఎక్కించే గత ప్రభుత్వాల పరిస్థితుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం సౌకర్యాలను ఊహించని రీతిలో మెరుగుపర్చిందన్నారు.