ఆర్కే నగర్‌ నుంచి నేనే పోటీ చేస్తా 

– టీ..టి.వి. దినకరన్‌ వెల్లడి
చెన్నై,అక్టోబర్‌23(జ‌నంసాక్షి) :  తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్‌ నుంచి పోటీ చేస్తానని శశికల మేనల్లుడు టి.టి.వి. దినకరన్‌ పేర్కొన్నారు. కానీ పార్టీ తరఫు
బలమైన అభ్యర్థుల వేటలో అధికార-ప్రతిపక్షాలు మునిగిపోయి ఉండగా.. స్వయంగా దినకరనే పోటీలో దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ విజయం ద్వారా అమ్మకు అసలైన వారసులం తామేనని (శశికళ వర్గం) నిరూపించుకునే అవకాశం వచ్చిందని దినకరన్‌ పేర్కొంటున్నారు. మరోపక్క ఆర్కే నగర్‌ నుంచి పోటీ చేయడానికి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌ కూడా సిద్ధంగా ఉన్నారు. జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆమె చనిపోయిన తర్వాత ఆర్కేనగర్‌లో ఉప ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అక్కడ ఓట్ల కోసం నగదు చెల్లించినట్లు చివరి నిమిషంలో తేలడంతో ఉప ఎన్నికను తాత్కాలికంగా నిలిపివేసింది.  కాగా, ఈ ఉప ఎన్నికపై స్పష్టత ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు స్పందించింది. డిసెంబర్‌ 31లోగా ఉప ఎన్నిక పూర్తి చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అభ్యర్థుల వేటలో పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. పార్టీలో అంతర్గతంగా చర్చించాకే అభ్యర్థి పేరును ప్రకటిస్తామని అన్నాడీఎంకే ప్రకటించగా.. డీఎంకే తరపున దాదాపు అభ్యర్థి ఖరారైనట్లేనని.. మరో వారంలో ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రతీ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.