ఆర్థిక వైఫల్యాలకు అద్దంపట్టిన ఆక్స్‌ఫాం సర్వే
దక్షుడు లేని ఇంటికి పదార్థం వేలక్షలు వచ్చినన్…అని సూక్తి ఒకటుంది. దక్షత లేని వారి చేతుల్లో కోట్లు గుమ్మరించినా అవి వేలుగానే మారుతాయే తప్ప కోట్లుగా మారవు. అలాగే దక్షత లేని రాజకీయ నేతల ఏలుబడిలో భారత పయనం కూడా అలాగే ఉంది. దేశాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తామన్న వారు చతికిల పడ్డారు. చేవచచ్చినపేదలు చస్తూనే ఉన్నారు. 70 ఏళ్లు దాటిన స్వతంత్ర భారతంలో ఇంకా పేదలు పేదలుగానే ఉంటున్నారు. ప్రకటించిన పథకాలు వారి దరిచేరడం లేదు. విజయ్ మాల్యాలాంటి వారు కోట్లు దోచుకుని ఏం చక్కా చెక్కేస్తారు. ఆదానీ, అంబానీ లాంటి వారు మరింతగా మిలియనీర్లుగా మారుతారు. వారి కుటుంబాలు ఇంకా బలపడుతూనే ఉంటాయి. కానీ పేదలకు రెండుపూటలా కడపు నింపుకుందామన్నా కరువే. పనిచేద్దామన్నా అవకాశాలు ఉండవు. భారత్‌లో జరుగుతున్న సంపద సృష్టిలో అత్యధిక భాగం ధనికుల వద్దకే చేరుతున్నదని ఓ తాజా సర్వే వెల్లడించిన తీరు పాలకులకు చెంపపెట్టు కావాలి. పాలకులు అనుసరిస్తున్న విపరీత ధోరణులు ప్రజలను పేదరికం నుంచి గట్టెక్కించడం లేదని తేలింది. దేశంలో ధనికులు మరింత ధనికులవుతుండగా, పేదలు మరింత దుర్భర స్థితికి చేరుకుంటున్నారని ఈ సర్వే తెలిపింది. ఈ అంతరం ఆర్థికాభివృద్ధి కాదని, దేశ విఫల ఆర్థిక వ్యవస్థకు నిదర్శనమని కూడా తేల్చి చెప్పింది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందు అంతర్జా తీయ హక్కుల సంస్థ ఆక్స్‌ఫాం ఈ నివేదికను విడుదల చేసింది. గత ఏడాది భారత్‌లో జరిగిన సంపద సృష్టిలో 73 శాతం కేవలం ఒక్కశాతం ఉన్న సంపన్నుల వద్దకు చేరిందని ఆక్స్‌ఫాం సర్వే తెలిపింది. ఇక దేశంలో సగభాగంగా ఉన్న 67 కోట్ల మంది పేదల సంపద గత ఏడాది కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగినట్టు వెల్లడించింది. దేశంలో ఆదాయ అసమానతలు భారీగా పెరిగి పోతున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనమని పేర్కొంది.నిజానికి గతేడాది పెద్దనోట్ల రద్దుతో పాటు, జిఎస్టీ ప్రవేశ పెట్టిన తరవాత ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగాయి. ఇప్పుడిప్పుడే పైకి వస్తూ సొంత కాళ్లపై నిలబడుతున్న వారికి ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం శరాఘాతంలా పరిణమించింది. బ్యాంకు ఖాతాలు తెరవండంటూ గొంతెత్తి అరిచి చివరకు బ్యాంకుల వద్దకు రాగానే గతంలో ఎన్నడూ లేని వాతలు పెట్టి ప్రజలు బ్యాంకుల మొహం చూడని పరిస్థితి తలెత్తింది. ఇక ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంపద సృష్టిలో 82 శాతం మొత్తం కేవలం ఒక్క శాతంగా ఉన్న ధనికుల వద్దకే చేరింది. పది దేశాలలో 70వేల మందిని సర్వే చేసి ఈ నివేదికను రూపొందించినట్టు ఆక్స్‌ఫాం తెలిపింది. తాము సర్వే చేసిన వారిలో మూడింట రెండువంతుల మంది ధనిక, పేదల మధ్య వ్యత్యాసాన్ని వెంటనే తగ్గించాలని కోరుకున్నారని పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం కొందరు ధనికుల కోసం కాకుండా అందరికోసం పనిచేసేలా చూడాలని ఆక్స్‌ఫాం భారత ప్రభుత్వానికి సూచించింది. ఎక్కువ మంది కార్మికులు పనిచేసే రంగాలను ప్రోత్సహించడం ద్వారా సమ్మిళిత వృద్ధిని సాధించాలని తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపింది. వ్యవసాయంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, ప్రభుత్వం ప్రకటించిన సామాజిక పరిరక్షణ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించింది. అత్యంత సంపన్నులపై అధిక పన్నుల భారం వేయాలని, పన్ను ఎగవేతలపై కఠినచర్యలు తీసుకోవాలని తెలిపింది. దేశ ఆర్థికాభివృద్ధి ఫలాలు కేవలం కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉండటం ఆందోళనకరమని ఆక్స్‌ఫాం భారత విభాగం పేర్కొంది. దేశంలో సంపన్నులు మరింత సంపదను పోగుచేసుకోవడం ఆర్థికాభి వృద్ధి కాదని, ఇది విఫల ఆర్థిక వ్యవస్థ లక్షణమని వ్యాఖ్యానించారు. దేశం కోసం ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ,
మౌలిక సదుపాయాలను నిర్మిస్తూ, పరిశ్రమల్లో శ్రమిస్తున్న వారు తమ పిల్లల విద్యకు, కుటుంబ సభ్యుల ఔషధాల కొనుగోలుకు, రెండు పూటల తిండికి నానా తంటాలు పడుతున్నారని పేర్కొన్నారు. ఇదంతా నిత్యం కళ్లకు కనపడుతున్న వైనం. అయినా దేశాన్ని ఉద్దరిస్తామని, ప్రోగ్రెస్ రిపోర్టు అందిస్తామని చెప్కపుకున్న పాలకులు పెరుగుతున్న అసమానతలను గుర్తించడం లేదు. అంతేనా అంటే దావోస్ పర్యటనకు వెళ్లేముందు ప్రధాని చేసిన ప్రకటన కూడా పేదలను అక్కున చేర్చుకునేలా లేదు. నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలు వెన్నాడుతున్నా పట్టించుకోని వైనం సర్వే ద్వారా తేటతెల్లం అయ్యింది. ఇతరుల సలహాలు పక్కన పెట్టడం, పార్టీలో సీనియర్లను అవమానించేలా వ్యవహరించడం, వారి అనుభవాన్ని తక్కువ చేయడం లాంటి చర్యలతో పాటు కొందరు పెట్టుబడిదారుల సంఓఏమం కోసం తీసుకున్న నిర్ణయాల కారణంగా గత పదేళ్ల యూపిఎ పాలనకన్నా మోడీ పాలన అధ్వాన్నంగా తయారయ్యింది. ధరల పెరగుదల సూచీనే దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలి. ప్రస్తుత ఆర్థిక విధానాలు ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తాయని, అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని ప్రోత్సహిస్తాయని సర్వే హెచ్చరించింది. ఈ నివేదిక పై ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. గతేడాది సృష్టించిన సంపదలో 73 శాతం అత్యధిక ధనవంతులైన ఒక శాతం ప్రజానికం చెంతకే చేరినట్లు వెల్లడించిన తీరును గమనిస్తే మన ఆర్తిక విధానాలు, పాలకుల తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిరుపేద జనాభా ఆదాయం ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఏ మాత్రమూ పెరగలేదని వెల్లడించింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దావోస్ సదస్సుకు హాజరవుతున్న వేళ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమిది. తాము తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలను సవిూక్షించుకుంటే తప్ప భారత్ గట్టెక్కడం కష్టం