ఆర్ధిక నేరాల కేసులో సత్యం బ్రదర్స్‌కు బెయిల్‌

2

హైదరాబాద్‌,మే 11 (జనంసాక్షి):

సత్యం కేసులో రామలింగరాజు సహా దోషులందరికీ ఊరట లభించింది. రామలింగరాజు, రామరాజు సహా అందరికీ బెయిల్‌ మంజూరైంది. సత్యం కేసులో నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టు వీరి బెయిల్‌ పిటిషన్‌కు అనుమతించి అందరికీ బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో రామలింగరాజు, రామరాజుకు రూ. లక్ష చొప్పున పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీ, మిగతా వారికి రూ.50 వేల చొప్పున పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. జరిమానాలో పదోవంతు ఇప్పుడు చెల్లించాలని, విడుదలైన నాలుగు వారాల్లోగా జరిమానా మొత్తం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో చర్లపల్లి జైలులో ఉన్న వీరు విడుదలకు మార్గం సుగమమైంది. సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ  ఆయన నాంపల్లి కోర్టులలో అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందిని  ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారందరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.