ఆర్మీలో ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్ కోసం పోరాడుతాం : రాహుల్
న్యూదిల్లీ, మే 23(జనంసాక్షి) : మాజీ సైనికులకు ఒకే ర్యాంక్, ఒకే పింఛన్ ఇచ్చే విషయంలో కేంద్రం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని ఎఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మాజీ సైనికులతో ఢిల్లీలో ఆయన సమావేశమయ్యారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఐతే, మోడీ సర్కార్ పాలన ఏడాది కావస్తున్నా దీనిపై ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో మాజీ సైనికుల తరఫున తమ పార్టీ పోరాడుతుందని హావిూ ఇచ్చారు. తమ ప్రభుత్వం నిధులు సమకూర్చినా మోదీ సర్కారు ఈ పథకాన్ని అమలు చేయట్లేదని, ఏడాది గడుస్తున్నా మోదీ సాధించిందేమీ లేదని రాహుల్ విమర్శించారు. దేశానికి రక్షణగా ఉండే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది పట్ల ప్రభుత్వం అలక్ష్యం వహించరాదని, వారి డిమాండ్లను వెంటనే అమలుచేయాలని రాహుల్ అన్నారు. దీనికోసం పోరాటానికి సిద్దంగా ఉన్నామని రాహుల్ స్పష్టం చేశారు.