ఆర్యభట్టతో ఆకాశంలో మొదలైన ప్రస్థానం

అంచెలంచలుగా విజయాల నమోదు
శ్రీహరికోట,జూలై23(జ‌నంసాక్షి):  ఆర్యభట్టతో ఇస్రో తన ప్రయోగాల పరంపరను ప్రారంభించింది మొదలు ఇప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులను, ఆర్ధిక ఇబ్బందునలు ఎదుర్కొన్నా, ఎప్పుఊ వెనకడుగు వేయలేదు. ఎత్తిన తలదించలేదు.  1962లో కేరళలోని తుంబ రాకెట్‌ ప్రయోగకేంద్రంతో అంతరిక్ష పరిశోధనలో తొలి అడుగుపడింది మొదలు ఇస్రో కేంద్రంగా సాగుతున్న పరిశోధనలు, ప్రయోగాలే ఇందుకు నిదర్శనం. ముందుగా, వాతావరణ పరిస్థితుల అధ్యయనానికి ఉపకరించే మూడు అడుగుల చిన్న సౌండ్‌ రాకెట్లను (ఆర్‌హెచ్‌-75) అంతరిక్షానికి పంపింది. 1975లో రష్యా సాయంతో మన తొలి ఉపగ్రహం ఆర్యభట్టను చేరవేసింది. అనంతరం 1979లో, శ్రీహరికోట కేంద్రం నుంచి ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను నింగి విూదికి సంధించింది. ప్రయత్నం విఫలమైనా, ఆ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలతో… 1980లో ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ రోహిణిని విజయవంతంగా గగనానికి చేర్చింది. 1979-81 మధ్యలో భాస్కర ప్రయోగం మరో ముందడుగు. సామాన్యులకు శాస్త్ర, సాంకేతిక ఫలితాలను చేరువ చేసేందుకు సమాచార ఉపగ్రహ ప్రయోగాలనూ చేపట్టింది. 1975-76లో ‘శాటిలైట్‌ ఇన్‌స్టుమ్రెంట్‌ టెలివిజన్‌ ఎక్స్‌పరిమెంట్‌’ ద్వారా… సమాచార ఉపగ్రహాన్ని విద్యా బోధన సాధనంగా ఎలా ఉపయోగించుకోవచ్చో కూడా నిరూపించింది. 1979లో ఆపిల్‌ సమాచార ఉపగ్రహాన్ని పంపింది. 1982-90 మధ్యకాలంలో విదేశీ రాకెట్ల సాయంతో ఇన్సాట్‌-1ను నింగికి చేరవేసింది. ఇది ఆకాశవాణి, దూరదర్శన్‌ కేంద్రాలను అనుసంధానం చేసి వినోద, విజ్ఞానాలతోపాటు విద్యావ్యాప్తికి దోహదపడింది. ఆతర్వాత చంద్రయాన్‌, మంగళ్‌యాన్‌ తదితర ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకూ శ్రీకారం చుట్టింది. అందులోనూ గత ఏడాది…మొతం తొమ్మిది ప్రయోగాలు చేపట్టింది. అన్నీ విజయవంతం అయ్యాయి. ఒక రాకెట్‌ ద్వారా వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలు  ప్రవేశపెట్టడం. పీఎస్‌ఎల్‌వీ-సి36 పీఎస్‌4లో (నాల్గో దశలో) రిమోట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌తో ద్రవ ఇంధనం నింపడం, నావిక్‌ వ్యవస్థ ద్వారా రాకెట్‌ పర్యవేక్షణ, ప్రతికూల వాతావరణంలోనూ రాకెట్‌ అనుసంధానం, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఉపగ్రహంలోని పెలోడ్స్‌ను మనమే అభివృద్ధి చేసుకోవడం… ఇలా అన్నీ విజయాలే.  ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో తనకు తానే సాటని ఇస్రో మరోసారి  నిరూపించింది.  ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన ఇస్రోకు అన్నివర్గాల నుంచి ప్రశంసలు అందాయి. భారత కీర్తి పతాకను రోదసిలో సగర్వంగా ఎగురవేయడం గర్వకారణం ఇస్రో ప్రపంచవ్యాప్త అంతరిక్ష ప్రయోగాలకు కేంద్ర బిందువు కానుంది. చంద్రాయాన్‌-2 ఇస్రో పరిశోధనల్లో కీర్తిచంద్రికగా నిలవనుంది.