ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో ఇండియా కీలుబొమ్మ

3

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ

కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షురాలిగా ఏడాది పొడిగింపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 8(జనంసాక్షి) :

ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు  ఇక్కడ జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ( సీడబ్ల్యూసీ) సమావేశంలో అధ్యక్షురాలిగా సోనియగాంధీని కొనసాగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో రాహుల్‌ పార్టీ పగ్గాలు చేపడతారన్న ఊహాగానాలకు తెరదించారు. దాదాపు మూడుగంటలు సాగిన సమావేశంలో పలు అంశాలపై సోనియా చర్చించారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హావిూలను విస్మరించి ఆర్‌ఎస్‌ఎస్‌ మార్గనిర్దేశనంలో నడుస్తోందని దుయ్యబట్టారు.మోడీ పాలనలో దేశ పురోగతి దెబ్బతింటోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌.భావజాలంతోనే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె విమర్శించారు. మన్మోహన్‌ ఆర్థిక విధానాలను విమర్శించిన మోదీకి ఇప్పుడు దిక్కుతోచట్లేదని సోనియా వ్యాఖ్యానించారు.దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసనలు,ఆందోళనలు చేయడంవల్లనే రైతులకు నష్టం చేసే భూ సేకరణ చట్ట సవరణను కేంద్రం ఉపసంహరించుకుందని సోనియా అన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ పాత్రను ఆమె ప్రస్తావించడం విశేషం. ఎఐసిసి ఉపాద్యక్షుడు రాహుల్‌ గాంధీని  సోనియాగాందీ మెచ్చుకున్నారు. భూ సేకరణ బిల్లు విషయంలో రాహుల్‌ క్రియాశీలకంగా వ్యవహరించారని ఆమె మురిసిపోయారు.పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో కొనసాగుతోందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోపించారు.  ప్రస్తుత రాజకీయాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ… మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రిస్తోందని… ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండా ఏమిటో అందరికీ తెలిసిందేనన్నారు. అధ్యక్షురాలిగా తిరిగి ఎన్నిక అయ్యాక  50 శాతం పార్టీ పదవులను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఏఐసీసీ అధ్యక్ష పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గించాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. పార్టీ అనుబంధ విభాగాల ఎన్నికలను ఏడాదిపాటు వాయిదా వేయాలని నిర్ణయించారు. అన్ని విభాగాలకు ఒకే రకమైన సభ్యత్వం ఇవ్వాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది.