ఆర్‌బిఐ వ్యవహారాలు ఆందోళనకరం

ట్వీట్‌ చేసిన చిదంబరం

ముంబయి,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): రిజర్వ్‌బ్యాంక్‌ వ్యవహారాలపై మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌బిఐకి కేంద్రం మార్గదర్శకాలు జారీ చేస్తే మరిన్ని చెడు వార్తలు వినాల్సి వస్తుందని ఆందోళనగా ఉందని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం ట్వీట్‌ చేశారు. ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్‌ 7 కింద రిజర్వ్‌ బ్యాంక్‌కు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లుగా, ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు వార్తలు

వెలువడుతున్నాయి. యుపిఎ ప్రభుత్వ హయాంలో 1991 ఆర్థిక వ్యవస్థలో సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టినపుడు, 1997 ఆర్థిక సంక్షోభం, 2008 ఆర్థిక మాంద్యం వంటివి తలెత్తినపుడు సెక్షన్‌ 7ను ప్రవేశపెట్టలేదని చిదంబరం పునరుద్ఘాటించారు. ఆర్‌బిఐ యాక్ట్‌ సెక్షన్‌ 7 ప్రకారం, 1934 ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశాలపై, బ్యాంక్‌ గవర్నర్‌తో సంప్రదించిన అనంతరం, కేంద్ర బ్యాంక్‌ విధులను జారీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే ఈ సెక్షన్‌ను ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆర్‌బిఐపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.